అర్జీలను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి
ఏలూరు (మెట్రో): పీజీఆర్‌ఎస్‌లో అర్జీలను నాణ్యతతో నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. 277 దరఖాస్తులు అందాయని, వాటిలో నిబంధనల మేర ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, నిబంధనల మేరకు లేని దరఖాస్తులను అందుకు గల కారణాలను స్పష్టంగా తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. దరఖాస్తును పరిష్కరించిన అనంతరం పరిష్కార విధానంపై దరఖాస్తుదారుడితో సంబంధిత శాఖల అధికారులు మాట్లాడాలన్నారు.
ఏలూరు రూరల్: డిసెంబర్ 3న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 25న ఏలూరులో దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించనున్నామని డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆసక్తి గలవారు 9948779015 నెంబరుకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.
ఏలూరు (టూటౌన్): జిల్లా అటవీ శాఖాధికారి(టెరిటోరియల్)గా పోతంశెట్టి వెంకట్ సందీప్ రెడ్డి జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సందీప్ రెడ్డి 2019లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. గతంలో డోర్నాల సబ్ డివిజనల్ అటవీ శాఖాధికారిగా, ఆత్మకూరు ఇన్‌చార్జ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. కడప, పాడేరు జిల్లా అటవీశాఖాధికారిగా విధులు నిర్వహించి ఏలూరు జిల్లాకు బదిలీపై వచ్చారు.
ఏలూరు టౌన్: ఏలూరు కొత్తపేట ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక కొత్తపేట గాదివారి వీధికి చెందిన గేదెల సాయికుమార్ (33) పూలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా భార్యతో విభేదాలు రావటంతో ఆమె నుంచి దూరంగా ఉంటున్నాడు. ఒంటరిగా జీవిస్తోన్న సాయికుమార్ ఆదివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
అర్జీలను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి


