
జయ జయహో జగన్నాథ
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చిన వెంకన్న క్షేత్ర దత్తత ఆలయం లక్ష్మీపురంలోని సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథరుని దివ్య రథోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా పూరీలో మాదిరిగా ఇక్కడ రథయాత్రను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రానికి రథయాత్ర నిర్వహించారు. సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని దారు విగ్రహాలను రథంలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథం ముందుకు సాగింది. ఆలయ యాగశాలలో స్వామివారు మత్స్యావతార అలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి దంపతులు ఆలయంలో పూజలు చేయించారు. వచ్చేనెల 6 వరకు రోజుకో అలంకారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు.

జయ జయహో జగన్నాథ