
కోకో గింజలను పూర్తిగా కొనాలి
పెదవేగి:కోకో రైతులు వద్ద ఉన్న కోకో గింజలు పూర్తిగా కొనుగోలు చేయాలని, ప్రభుత్వం ప్రోత్సాహంతో కలిపి లక్ష్యాలతో నిమిత్తం లేకుండా జూలై 15 వరకు కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం విజ యరాయి గాంధీనగర్‌లోని సీతారామ కల్యాణ మండపంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముందుగా కోకో గింజల కొనుగోలు సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. కోకో రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని పలుచోట్ల రైతులు దరఖాస్తులు ఇచ్చినా కంపెనీలు గింజలు కొనుగోలు చేయ డం లేదన్నారు. కొన్ని రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో కిలో కోకో గింజలకు రూ.500 ధర చెల్లించేలా చూడాలన్నారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చేలా వెంటనే ఫార్ములా రూపొందించాలని కోరారు.
ఆయిల్‌పామ్ రైతులకు సంఘీభావం
పెదవేగి ఆయిల్‌ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయిల్‌పామ్ రైతులు చేస్తున్న పోరాటానికి కోకో రైతు సంఘం తరఫున సంఘీభావం ప్రకటించారు. ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని కోరారు. విజయరాయి ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, కోకో రైతు సంఘం నాయకులు పాలడుగు నరసింహారావు, గుదిబండి వీరారెడ్డి, కోనేరు సతీష్‌బాబు పాల్గొన్నారు.