
కవిత్వంలో రుతువర్ణనకు ప్రాధాన్యం తొలినాళ్ల నుంచే ఉంది. ప్రబంధాలలోనైతే రుతువర్ణన ఒక తప్పనిసరి తతంగం. మహాకావ్యంలో అష్టాదశ వర్ణనలు ఉండాలనీ, వాటిలో రుతువర్ణన తప్పనిసరీ అని భరతుడు, భామహుడు, భోజుడు వంటి లాక్షణికులు చెప్పారు. ఏసీ విలాసాలకు అలవాటు పడిన అధునాతన కవులు ఏ ఎండకా గొడుగు పట్టే విద్యలో బాగా ఆరితేరిపోయారు గానీ, అమాయకులైన సత్తెకాలపు కవులు ఏయే రుతువులలో ఆయా ఆనంద పరితాపాలను అనుభవించి పలవరించారు. విశాఖ వీధుల్లో కాలినడకన తిరుగుతూ నడివేసవి ధాటిని అనుభవించిన మహాకవి శ్రీశ్రీ ‘ఎండకాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా!’ అని వాపోయాడు. వేసవిలో నీటి ఎద్దడి దాదాపుగా దేశవ్యాప్త సమస్య. వేసవి నీటి ఎద్దడి కవిసార్వభౌముడు శ్రీనాథుణ్ణి కూడా బాధించింది. ఆయన ఊరుకుంటాడా? వెంటనే, ‘సిరిగల వానికి జెల్లును/ దరుణులు బదియారు వేల దగ పెండ్లాడన్/ తిరిపెమున కిద్దరాండ్రా!/ పరమేశా గంగ విడుము పార్వతి చాలున్’ అంటూ ఏకంగా పరమేశ్వరుడినే ఎద్దేవాగా గద్దిస్తూ ఆశువుగా ఒక చాటుపద్యాస్త్రాన్ని వదిలాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బాటసారులకు నీటిచుక్క దొరకకుంటే, వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ‘పెదవి పేటెత్తు నాలుక పిడుచగట్టు/ గొంతు తడితీయు నెక్కిట కొంత తడవు/ దాహమున కుదకము లేక తడసెనేని/ గలదె మఱి యంతకన్న దుఃఖంబు జగతి/’ అంటూ ‘దశావతార చరిత్రము’లో దాహార్తి బాధను కళ్లకు కట్టాడు ధరణిదేవుల రామయమంత్రి.
గ్రీష్మం మనకు అంత ఆహ్లాదకరమైన రుతువు కాదు. ఎండ తాకిడి ఎక్కువైతే, తాపానికి తాళలేని అర్భకులు పిట్టల్లా రాలిపోతారు. ఇక చిన్నా చితకా పిచ్చుకల వంటి అల్పజీవుల పరిస్థితి వేరే చెప్పనవసరం లేదు. ‘ఎండుటాకులు సుడిగాలికి తిరిగెను గిర్రున– వడగొట్టిన భిక్షుకి అరచెను వెర్రిగ– పంకా కింద శ్రీమంతుడు ప్రాణం విడిచెను– గుండెక్రింద నెత్తురు నడచెను’ అంటూ వేసవి వడదెబ్బ ధాటిని వర్ణించాడు తిలక్. ‘ఆకసమును జూచినంత గ్రీష్మ తపాది/ భీకరంబయి గుండియ దాక మండు/ లోకమెల్ల పయోధరా లోకనార్థి/ శీకర స్నాన సౌఖ్య మాశించు నేడు’ అంటూ దాశరథి గుండెలు వేడెక్కించేలా గ్రీష్మతాపాన్ని వర్ణించాడు. వేసవితాపం ఒక్కోసారి తాళనలవి కానంత పెచ్చుమీరుతుంది. తాపోపశమన మార్గాలు అందుబాటులో లేని సామాన్యులు అల్లల్లాడిపోతుం టారు. ‘గగన ఘన ఘోట ఖురా నిరాఘాట ధాటి/ నలఘు బ్రహ్మాండ భాండమ్ము నలగ ద్రొక్కి/ చటుల దుర్జన రాజ్య శాసనమ్ము వోలె/ సాగె మార్తాండ చండ ప్రచండ రథము’ అంటారు తన ‘ఋతుఘోష’లో శేషేంద్ర. బాధించే ఎండ తీవ్రతను దుర్జన రాజ్య శాసనంతో పోల్చడం అత్యంతా ధునికమైన అభివ్యక్తి. ‘ఆగలేమోయి దేవుడా! వేగలేము/ ఎంతటెండ! ఎంత గాడ్పు!/ ఎంత ఉష్మ!/ చెవులు మెలిపెట్టి– చెంపలు ఛెళ్లుమనగ/ కొట్టి ఫెళ్లున నవ్వెడి కోపధారి/ ప్రభుని నిప్పుల చూపుల బ్రతకలేము!’ అంటూ వేసవిలో సామాన్యుల హాహాకారాలను వినిపిస్తారు కొండ చంద్రమౌళిశాస్త్రి.
గ్రీష్మం అంటే ఉక్కపోత, వడదెబ్బలు, నీటిఎద్దడి వంటి కష్టాలు మాత్రమేనా? గ్రీష్మంలోనూ కొన్ని సానుకూలతలు ఉన్నాయి. ఆధునికుల్లో మిగిలిన కవులకు భిన్నంగా పైడిపాటి సుబ్బ రామశాస్త్రి గ్రీష్మాన్ని సానుకూల దృక్పథంతోనే చూశారు. అందుకే, ‘ఎంత నెండ రగుల్చు నంత తీపి తగుల్చు/ చూడ ముచ్చటైన చూతమందు/ ఎంతగా నెండలు హెచ్చు నంతగ హెచ్చు/ పరిమళమ్మూదు సంపంగి నందు... ఆగ్రహమెంతయో యంత యార్ద్రబుద్ధి/ తరణి సమయమ్ము బెంచు నుదార బుద్ధి/ దిరిసెనపు సౌకుమార్యంపు దేజునెఱుగు/ గ్రీష్మ ఋతు వల్లభుండన్న గేవలుండె’ అని గ్రీష్మ రుతురాజును ప్రస్తుతించడం విశేషం. ఉక్కపోతలతో ఉడుకెత్తించే ఎండా కాలంలోనే నోరూరించే మామిడిపండ్లు, పనసపండ్లు, చల్లదనాన్నిచ్చే తాటిముంజెలు విరివిగా దొరుకుతాయి. మరుమల్లెలు, సంపెంగలు విరగబూసి వేసవిని పరిమళభరితం చేస్తాయి. ఆవకాయలు, వడియాలు పెట్టుకోవడానికి వేసవి చాలా అనువైన కాలం. వేసవిని సద్వినియోగం చేసుకుని, వీటిని సిద్ధం చేసుకుంటే, ఏడాది పొడవునా భోజనంలోకి ఆదరువులుగా పనికొస్తాయి. తెలుగువాళ్ల ఇళ్లల్లో ఆవకాయ పెట్టే ప్రక్రియ దాదాపు ఒక యజ్ఞం మాదిరిగానే జరుగుతుంది. ఆవకాయపైన కూడా మన రచయితలు కలాలు జుళిపించారు. భానుమతీ రామకృష్ణ రాసిన ‘అత్తగారూ ఆవకాయ’ కథలో ఆవకాయ పెట్టే ప్రహసనం పాఠకుల పెదవులపై నవ్వులు విరబూయిస్తుంది.
ఏడాదిలో ఎక్కువకాలం చలిలో వణికే పాశ్చాత్యదేశాల ప్రజలకు మాత్రం గ్రీష్మం ఒక పండగే! అందుకే పాశ్చాత్యకవుల వేసవి కవిత్వం ఉల్లాసభరితంగా, ఉత్సాహభరితంగా ఉంటుంది. అమెరికన్ కవయిత్రి ఎమిలీ డికిన్సన్ వేసవి గురించి పుంఖాను పుంఖాలుగా కవితలు రాసింది. వాటిలో ఎక్కడా ఉక్కపోత కనిపించదు. ఉష్ణమండలానికి చెందిన కరీబియన్ దీవులలో ఒకటైన సెయింట్ లూసియాకు చెందిన ప్రఖ్యాతకవి, నోబెల్ బహుమతి గ్రహీత డెరెక్ వాల్‌కాట్ కవిత ‘మిడ్ సమ్మర్, టొబాగో’లోని ‘వైట్ హీట్/ ఎ గ్రీన్ రివర్/ ఎ బ్రిడ్జ్/ స్కార్చ్‌డ్ యెల్లో పామ్స్/’ వర్ణనలో నడివేసవి వేడి పాఠకులనూ తాకుతుంది. మన సాహిత్యంలో వసంత, శరదృతు వర్ణనలకు దక్కిన ప్రాధాన్యం గ్రీష్మవర్ణనకు దక్కలేదు. అలాగని ప్రకృతిని కాచివడబోసిన కవులెవరూ వేసవిని విస్మరించలేదు సరికదా యథాశక్తి తమ రచనలతో పాఠకులను ఉడుకెత్తించారు.