ఈ దాడి అమానుషం

attack on salman rushdie inhumane - Sakshi

దాదాపు మూడున్నర దశాబ్దాలు గడిచినా ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ కంఠాన్ని ఒక కత్తి క్రోధంతో, కోపంతో గురిచూస్తూనే ఉన్నదని, ఇన్నాళ్లుగా అది అనువైన సమయం కోసం నిరీక్షిం చిందని అమెరికాలోని న్యూజెర్సీలో ఆయనపై జరిగిన హంతక దాడి రుజువు చేసింది. ఈ దాడిలో సల్మాన్‌ రష్దీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక కన్ను పూర్తిగా దెబ్బతిన్నదని, కాలేయానికి కూడా తీవ్ర గాయమైందని, అయితే ఆయన ప్రాణానికొచ్చిన ముప్పేమీ లేదని వైద్యులు ప్రకటించటం ఊరటనిస్తుంది. ‘శాటానిక్‌ వర్సెస్‌’ నవలలో పాత్రల చేత పలికించిన సంభాషణలు రష్దీ ప్రాణం మీదకు తెచ్చాయి. ఆ నవలలో ఇస్లాం మతాన్నీ, ఆ మత ప్రవక్తనూ కించపరిచారన్నది రష్దీపై ఉన్న ప్రధాన అభియోగం.

అయితే మొత్తం ఇతివృత్తాన్ని చదవకుండానే ఆ నవలపై దురభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఇరాన్‌లోని మతాచార్యుడొకరు ఫత్వా జారీ చేశారని, పాకిస్తాన్‌ మత గురువుల అభిప్రాయమే దానికి ప్రాతిపదికని అమెరికాలో స్థిరపడిన ఇరాన్‌కి చెందిన రమితా నవాయ్‌ అనే మహిళ ఇటీవల ట్వీట్‌ చేసింది. ఆ ఫత్వాను వెనక్కు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారన్నది ఆ మహిళ కథనం. అందులో నిజానిజాల మాటెలా ఉన్నా ఒక సృజనాత్మక రచన రచయితకు ప్రాణాంతకం కావడం సభ్యసమాజం జీర్ణించుకోలేనిది. సమాజాన్ని ఉన్నతీకరిం చేందుకు కృషి చేసే కవులు, రచయితలు, కళాకారులు ప్రపంచ దేశాలన్నిటా ఈనాటికీ మృత్యు నీడలో, నిర్బంధాల్లో బతుకీడ్చే దుఃస్థితి ఉండటం దారుణాతి దారుణం.

దక్షిణాసియాలోని భారత్‌ 75 ఏళ్ల క్రితం స్వాతంత్య్రాన్ని సాధించిన సందర్భంలో జరిగిన దేశ విభజన హిందూ, ముస్లింల మధ్య ఎంతటి విద్వేషాగ్నులను రగిల్చిందో... లక్షలాదిమంది ప్రాణాలు తీసి, కోట్లాదిమందిని ఎలా నిరాశ్రయులను చేసిందో తన ‘మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌’ నవల ద్వారా రష్దీ కళ్లకు కట్టారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా జరుపుకోవడానికి కొన్ని గంటల ముందు రష్దీపై దాడి జరగడం యాదృచ్ఛికమే అయినా... దశాబ్దాలు గడిచేకొద్దీ మతోన్మాదం, విద్వేషం ఖండాంతరాలు దాటి కార్చిచ్చులా వ్యాపిస్తున్న వైనాన్ని ఈ ఉదంతం బయటపెట్టింది.

1988లో ‘శాటానిక్‌ వర్సెస్‌’ నవల బయటి కొచ్చాక రష్దీని హతమార్చినవారికి 30 లక్షల డాలర్లు బహుమతిగా ఇస్తామని ఇరాన్‌ మతాచార్యుడు ప్రకటించాడు. దానికి ఆనాటి ఇరాన్‌ ప్రధాన మతాచార్యుడు ఆయతుల్లా ఖొమైనీ కూడా మద్దతు నిచ్చారు. దాంతో ఆయన అజ్ఞాతవాసంలోకి పోవాల్సివచ్చింది. తొమ్మిదేళ్ల అజ్ఞాతం రచయితగా రష్దీని కుంగదీసింది. ఆ తర్వాత బయట సంచరిస్తున్నా కట్టుదిట్టమైన భద్రత తప్పలేదు. ఎన్నో సందర్భాల్లో దీనిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పలుమార్లు మన దేశాన్ని కూడా సందర్శించారు. అయితే జైపూర్‌ సాహిత్యోత్సవానికి ఆయన్ను ఆహ్వానించిన నిర్వాహకులు అటు తర్వాత మతోన్మాదుల బెదిరింపుతో వెనక్కి తగ్గడం రష్దీని బాధించింది. ఇస్లాం మత రిపబ్లిక్‌ అయిన పాకిస్తాన్‌లో కూడా ఇంతటి అవమానం తనకు జరగలేదని ఆయనొక సందర్భంలో అన్నారు. ఈ ఫత్వా తన ప్రతిష్ఠను దెబ్బతీసిందని గ్రహించిన ఇరాన్‌ ప్రభుత్వం ఇకపై ఫత్వాకు తమ మద్దతు ఉండబోదని ప్రకటించినా, నజరానా మొత్తాన్ని ఒక మత సంస్థ పెంచిందని ప్రభుత్వ అనుకూల మీడియా 2016లో ప్రకటించటం గమనించదగ్గది.

సృజనాత్మక రచన లు సహా భిన్న కళారూపాలు దేశదేశాల్లో ఎలా దాడులకు గురవుతున్నాయో, వాటి రూపకర్తలను ఎంతగా వేధిస్తున్నారో నిత్యం తెలుస్తూనే ఉంది. రష్దీపై ఫత్వాకు ఎన్నో దశాబ్దాల ముందు నుంచీ ఈ రకమైన వేధింపులు ఉనికిలో ఉన్నాయి. అయితే ‘శాటానిక్‌ వర్సెస్‌’ వెలువడిన అనంతర కాలంలో వరుసగా ఇస్లాం మతానుకూల దేశాలపై పాశ్చాత్య దేశాలు విరుచుకుపడిన తీరు కారణంగా ఇస్లామిక్‌ దేశాల ప్రజానీకంలో రష్దీపై ద్వేషం మరింత పెరిగింది. రష్దీ రచన కూడా పాశ్చాత్య ప్రపంచం సాగిస్తున్న దాడుల్లో భాగమని వారు విశ్వసించారు. ముస్లింలు అధికంగా నివసించే బోస్నియా–హెర్జ్‌గోవినా రిపబ్లిక్‌లో క్రైస్తవులు, ముస్లింల మధ్య ఘర్షణలు, ‘నాటో’ జోక్యం, ఆ తర్వాత అమెరికా నాయకత్వాన సంకీర్ణ దళాలు ఇరాక్‌పై సాగించిన దురాక్రమణ, అఫ్ఘానిస్తాన్‌ దురాక్రమణ వగైరాలు సరేసరి.

మనోభావాలు దెబ్బతినడం, తమ విశ్వాసాలపై దాడి జరిగిందనుకోవడం వర్తమానంలో ఏ ఒక్క దేశానికో, మతానికో పరిమితమై లేదు. మన దేశంలో ఈ జాడ్యం కులాలకు కూడా అంటింది. ఏదో సాకుతో భిన్న కళారూపాలను నిషేధించాలంటూ ఆందోళనలకు పూనుకోవడం రివాజుగా మారింది. ‘జై భీమ్‌’ చిత్రంపై వన్నియర్‌ కులస్థులు అభ్యంతరం చెబుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ ఇటీవల మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు తలమానికమైనది. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ కలబుర్గి, గోవింద్‌ పన్సారే, గౌరీ లంకేశ్, దాభోల్కర్‌లను ఉన్మాదులు కాల్చిచంపడం, ఏళ్లు గడిచినా కారకులైనవారికి ఇప్పటికీ శిక్షపడకపోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. మన దేశంలో భీమా–కోరెగావ్‌ కేసులో రెండున్నరేళ్లుగా అనేకమంది రచయితలు, మేధావులు జైళ్లలో మగ్గటం వర్తమాన విషాదం. సృజనాత్మక ప్రపంచంలో రూపొందే ఏ కళారూపం బాగోగులనైనా లోతుగా చర్చించటం, భిన్నాభిప్రాయాలను గౌరవించటం నాగరీక సమాజాల మౌలిక లక్షణంగా ఉండాలి. ప్రాణాలు తీయటం, నిర్బంధాలు, నిషేధాలు విధించటం అమానుషం, అనైతికం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top