పరీక్షా కాలం | Sakshi
Sakshi News home page

పరీక్షా కాలం

Published Thu, Mar 28 2024 3:40 AM

పాఠశాల విద్యార్థులు  - Sakshi

రాయవరం: వేసవి కాలం వచ్చేసింది. ఎండలు క్రమేపీ ముదురుతున్నాయి. ఉష్ణోగ్రతలతో పాటు విద్యార్థుల్లో పరీక్షల వేడి కూడా మొదలైంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకూ వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 5 తరగతులకు ఏప్రిల్‌ 6వ నుంచి 16వ తేదీ వరకూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహిస్తారు. అలాగే 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్‌ 6 నుంచి 19వ తేదీ పరీక్షలు జరుగుతాయి. వీరిలో 6 నుంచి 8 తరగతుల విద్యార్థులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తొమ్మిదో తరగతి విద్యార్థులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ పరీక్షలు రాస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 3 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సీబీఏ విధానంలో, 9వ తరగతికి సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు జరుగుతాయి. ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు మాత్రం పాత విధానంలోనే నిర్వహిస్తారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల పరిధిలో చదువుతున్న 1,83,613 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

జిల్లాలో పాఠశాలలు

జిల్లాలో 2,036 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,580 ప్రభుత్వ యాజమాన్య పరిధిలో, 456 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1 నుంచి 5 తరగతులకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో 42,014 మంది, ప్రైవేట్‌ పాఠశాలల్లో 56,313 మంది చదువుతున్నారు. 6–9 తరగతులకు చెందిన 55,006 మంది విద్యార్థులు, 30,280 మంది ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు.

ప్రశ్నాపత్రాల పంపిణీకి చర్యలు

మండల విద్యాశాఖ కార్యాలయాలకు ప్రశ్నాపత్రాలను చేర్చే పనిలో జిల్లా కామన్‌ ఎగ్జామ్‌ బోర్డు(డీసీఈబీ) నిమగ్నమైంది. ఈనెల 30వ తేదీ నాటికి మండల కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను పూర్తి స్థాయిలో పంపించే అవకాశం ఉంది. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు వాటిని సరి చూసుకుని ఎమ్మార్సీలో భద్రపర్చుకోవాలి. పరీక్షల ప్రారంభం నుంచి సంబంధిత ప్రశ్నాపత్రాల బండిళ్లను ఏరోజుకారోజు పరీక్షకు గంట ముందు ఎమ్మార్సీల నుంచి హెచ్‌ఎంలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

పారదర్శకంగా..

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల మాదిరిగానే ఈ వార్షిక పరీక్షలను నిర్వహించాలి. ఎటువంటి అపోహలకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో జరపాల్సిన బాధ్యత హెచ్‌ఎంలపై ఉంది. ఎటువంటి అవకతవకలు, లోపాలు చోటుచేసుకున్నా సంబంధిత హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు.

– ఎం.కమలకుమారి, డీఈవో, అమలాపురం.

పరీక్షా పత్రాల పంపిణీకి ఏర్పాట్లు

పరీక్షా పత్రాల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షలు రాతపూర్వక విధానంలోనే నిర్వహిస్తున్నాం. ఎస్‌సీఈఆర్‌టీ నిబంధనల ప్రకారం పరీక్షలను పాఠశాల స్థాయిలో పక్కాగా నిర్వహించాలి.

– బి.హనుమంతురావు, డీసీఈబీ సెక్రటరీ,

అమలాపురం.

ఏప్రిల్‌ 6 నుంచి వార్షిక పరీక్షలు

సిద్ధమవుతున్న 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు

టైం టేబుల్‌ విడుదల

పరీక్షల నిర్వహణకు ఎస్‌సీఈఆర్‌టీ టైమ్‌ టేబుల్‌ విడుదల చేసింది. పరీక్షల నిర్వహణ అనంతరం ఏప్రిల్‌ 21వ తేదీలోగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు సూచించారు. ఏప్రిల్‌ 23న ప్రోగ్రెస్‌ కార్డులను విద్యార్థులకు అందజేయడంతో పాటూ తరగతి వారీగా ప్రమోషన్‌ జాబితాలు సిద్ధం చేయాలి.

ఒకటి నుంచి ఐదు తరగతులకు..

1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు 6న తెలుగు, 8న ఇంగ్లిషు, 10న ఇంగ్లిష్‌ పార్ట్‌–బి (టోఫెల్‌), 12న గణితం, 13న పరిసరాల విజ్ఞానం పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానమైన పరీక్షలు 13తో ముగుస్తాయి. 15న ఓఎస్‌ఎస్‌సీ, 16న 4వ తరగతి విద్యార్థులకు మాత్రం స్టేట్‌ లెవల్‌ ఎచీవ్‌మెంట్‌ సర్వే (స్లాష్‌) పరీక్షను నిర్వహించనున్నారు.

ఆరు నుంచి తొమ్మిది తరగతులకు..

6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు 6న తెలుగు, 8న హిందీ, 10న ఇంగ్లిషు పార్ట్‌–ఎ, 12న ఇంగ్లిషు పార్ట్‌–బి (టోఫెల్‌), 13న గణితం, 15న ఒకటి నుంచి ఎనిమిది తరగతులకు జనరల్‌ సైన్స్‌, 9వ తరగతికి ఫిజికల్‌ సైన్స్‌, 16న బయలాజికల్‌ సైన్స్‌, 18న సోషల్‌ స్టడీస్‌, 19న 8, 9 తరగతులకు కాంపోజిట్‌ కోర్సులు/ఓఎస్‌ఎస్‌సీ1 అండ్‌ 2 పరీక్షలు, అదే రోజు 6,7 తరగతులకు పేపర్‌–1, పేపరు–2 పరీక్షలు నిర్వహిస్తారు.

1/2

2/2

Advertisement
Advertisement