బంగారం సురక్షితంగా అప్పగింత
తాళ్లరేవు: ఒక మహిళ విలువైన బంగారాన్ని పడేసుకోగా, అది దొరికిన వ్యక్తి సురక్షితంగా ఆమెకు అప్పగించి నిజాయితీ చాటారు. గాడిమొగ పంచాయతీ లక్ష్మీపతిపురం గ్రామానికి చెందిన లంకే వీరవేణి మంగళవారం బ్యాంకుకు వెళ్లి కుదవపెట్టిన బంగారాన్ని విడిపించుకుంది. అక్కడి నుంచి తిరిగి వస్తూ గుడ్డివానితూము సెంటర్‌లో మాంసం కొనేందుకు దుకాణం వద్ద ఆగింది. అక్కడ మాంసం తీసుకుంటుండగా బ్యాగులో నుంచి బంగారు వస్తువులు జారి కింద పడిపోయాయి. అది గమనించని వీరవేణి ఇంటికి వెళ్లిపోయింది. అయితే ఆ బంగారు వస్తువులు కోరంగి పంచాయతీ వైఎస్సార్ సీపీ కన్వీనర్ సంగాడి శ్రీనివాస్‌కు దొరికాయి. వాటిని పరిశీలించగా బంగారు వస్తువులతోపాటు అప్పు చెల్లించిన రశీదు, ఆధార్‌కార్డు ఉండడంతో వీరవేణికి సురక్షితంగా అందజేశారు. లక్షలాది రూపాయల విలువైన బంగారు వస్తువులను తిరిగి ఇచ్చి మానవత్వం చాటిన శ్రీనివాస్‌ను వైఎస్సార్ సీపీ తాళ్లరేవు మండల కన్వీనర్ కాదా గోవిందకుమార్, స్థానికులు అభినందించారు.


