● విధిని ఎదిరించి నిలబడిన దివ్యాంగులు
● మొక్కవోని దీక్షతో
ముందుకు సాగుతున్న వైనం
● ఆపన్న హస్తమందించిన
మాజీ సీఎం వైఎస్ జగన్
● చంద్రబాబు పాలనలో పింఛన్ల
వెరిఫికేషన్ పేరుతో వేధింపులు
● నేడు అంతర్జాతీయ
దివ్యాంగుల దినోత్సవం
కపిలేశ్వరపురం: వైకల్యం భౌతికంగా మాత్రమే వెనుకబాటు. సంకల్ప బలం ఉంటే వైకల్యం తోక ముడుస్తుంది. ప్రతిభ కనబర్చడంలో దివ్యాంగులు ఏ మాత్రమూ తక్కువ కాదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దివ్యాంగుల ప్రగతి, ప్రతిభను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. వారి పట్ల చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న విధానాలు విస్తుగొల్పుతున్నాయి. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కథనం...
చంద్రబాబు పాలనలో సతమతం
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దివ్యాంగులకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఎడాపెడా వాగ్దానాలు ఇచ్చారు. తీరా అధికారంలోకి రాగానే దివ్యాంగ పింఛను లబ్ధిదారుల్లో అనర్హులున్నారంటూ సర్వే చేపట్టి వారిని తీవ్ర ఆందోళనకు గురిచేశారు. వైకల్యంతో బాధపడుతున్న వారి రూ.15వేల పింఛన్లపై అక్కసు వెళ్లగక్కుతూ దివ్యాంగులను వేధిస్తున్నారనే విమర్శలున్నాయి. కొత్తగా అందజేసిన దరఖాస్తులు తిరస్కరణకు గురి చేశారంటూ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్రీడల్లో రాణిస్తూ..
ఈ ఏడాది మార్చిలో గుజరాత్ సూరత్‌లో నిర్వహించిన అంతర్జాతీయ వీల్ చైర్ క్రికెట్ టీ–10 మానస్ కప్ టోర్నీలో ఏపీ వీల్ చైర్ క్రికెట్ జట్టు ప్రతిభ కనబర్చింది. 15 జట్టు సభ్యుల్లో ఎనిమిది మంది ఉమ్మడి తూర్పు గోదావరికి చెందిన క్రీడాకారులున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 8 వరకూ రాజస్థాన్ అల్వార్‌లో నిర్వహించిన 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ –2024 పోటీల్లో అమలాపురానికి చెందిన రెడ్డి నరేంద్రకుమార్, జి.గంగరాజు రన్నింగ్ విభాగంలో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు.
కంటి చూపులేకపోయినా...
కాళ్లు కదలకపోయినా..
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామానికి చెందిన 36 ఏళ్ల కసిరెడ్డి సత్తిబాబు పుట్టుకతో అంధుడు. తండ్రి జోగిరాజు వ్యవసాయ కూలి, అమ్మ నాగమణి గృహిణి. వారికి సత్తిబాబు పెద్ద కుమారుడు కాగా మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆరో తరగతి వరకూ స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనూ, 7 నుంచి పది వరకూ మండపేటలోని అంధుల పాఠశాలలోనూ, గ్రాడ్యుయేషన్‌ను 2007–10 విద్యాసంవత్సరంలో తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోనూ చదివారు. ఉపాధ్యాయుడు అవ్వాలన్న తలంపుతో నెల్లూరు జిల్లా గూడూరులో బీఈడీ పూర్తి చేశారు. 2014లో డీఎస్సీ రాసినా విజయం వరించలేదు. అదే ఏడాది రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. సత్తిబాబు మాత్రం మనోధైర్యంతో ముందుకు సాగుతూ 2018లో మరోసారి ప్రయత్నించారు. రెట్టించిన ధైర్యంతో 2025 డీఎస్సీలో విజయం సాధించారు. ప్రస్తుతం కాకినాడలోని ఆనంద భారతి మున్సిపల్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. పాఠశాలలో వీల్ చైర్‌పై కూర్చుని విద్యార్థులకు బోధిస్తున్నారు. పాఠ్యాంశాలను తన బ్రెయిలీ లిపిలో చదువుకుని అవగాహనను పెంచుకుంటున్నారు.
జననేత జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్న దివ్యాంగులు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేసి దివ్యాంగుల చెంతకు పాలనను తీసుకొచ్చారు. ఒకటో తేదీ తెల్లవారుజామునే దివ్యాంగుడికి రూ.మూడు వేలు, తీవ్ర వైకల్యం గలవారికి రూ.15వేల చొప్పున పింఛను అందించారు. ఉమ్మడి జిల్లాలో 70,984 మంది దివ్యాంగులు రూ.22,14,63,000 విలువైన పింఛన్లను నెల నెలా పొందారు. సచివాలయంలోనే సదరం స్లాట్ బుకింగ్ సదుపాయం దక్కింది. ఉమ్మడి జిల్లాలోని 64 భవిత కేంద్రాలను బలోపేతం చేశారు.
మానవత్వం చూపండి
వైకల్యం ఉన్నవారిని జాలితో కాకుండా మానవత్వంతో చూడాలి. వారికి చేయూతనివ్వాలి. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి.
– వేల్పూరు వీరబాబు,
ఉపాధ్యాయుడు, వెదురుమూడి
15 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు దూరమైనా..
రాయవరం మండలం వెదురుపాకకు చెందిన అంధుడైన వేల్పూరి వీరబాబు తల్లిదండ్రులు 15 ఏళ్ల వయసులో చనిపోయారు. ఒకపక్క కంటి చూపు లేకపోవడంతో పాటు అమ్మనాన్నల తోడు దూరమవ్వడం వీరబాబును కుంగదీసింది. 2008 నుంచి 2010 వరకూ బొమ్మూరు డైట్ కళాశాలలో టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి 2012 డీఎస్సీలో ప్రతిభ కనబర్చి దివ్యాంగ కోటాలో కాకుండా జనరల్ కోటాలో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని సాధించారు. ప్రస్తుతం వెదురుమూడి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు.
వైకల్యంపై గెలిచిన సంకల్పం
వైకల్యంపై గెలిచిన సంకల్పం
వైకల్యంపై గెలిచిన సంకల్పం


