విద్యుదాఘాతానికి కౌలురైతు మృతి
కాజులూరు: మండలంలోని దుగ్గుదుర్రులో కౌలురైతు కొప్పుశెట్టి అన్నవరం (67) విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మూడు రోజులు క్రితం అదృశ్యమైన కౌలురైతు మంగళవారం సాయంత్రం ట్రాన్స్‌ఫార్మర్ వద్ద శవమై కనిపించటంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నవరం గ్రామంలోని ఒక రైతుకు చెందిన మూడున్నర ఎకరాల పొలం కొన్నేళ్లుగా కౌలుకు సాగుచేస్తున్నాడు. ఆదివారం పొలానికి వెళ్లిన అన్నవరం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా అన్నవరం పొలానికి సమీపంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద తుప్పలలో నుంచి పొగలు రావటం స్థానిక రైతులు గమనించారు. మంగళవారం సాయంత్రం కొందరు రైతులు దగ్గరకు వెళ్లి చూడగా అన్నవరం విద్యుత్ వైర్లకు చుట్టుకుని ఉన్నాడు. విద్యుత్ షాక్ వల్ల అతని శరీరం నుంచే పొగలు వస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ సరఫరా నిలుపుదల చేసి తుప్పలు తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆదివారం అన్నవరం పొలం పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా వర్షం కారణంగా ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తగులుకుని షాక్‌కు గురై మృతిచెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. గొల్లపాలెం ఎస్సై ఎం మోహన్‌కుమార్, ట్రాన్స్‌కో, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు అన్నవరం భార్య ఇటీవల మృతి చెందగా కుమార్తె వద్ద ఉంటున్నాడు.
రామేశంపేటలో మరొకరు
రంగంపేట: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడని ఎస్సై శివప్రసాద్ తెలిపారు. రామేశంపేట గ్రామానికి చెందిన పిల్లల తాతబ్బాయి (51) మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న తన ఇంటి రెండో ఫ్లోర్ పనులు ఎంతవరకు వచ్చాయో చూద్దామని పైకి వెళ్లాడు. అక్కడ పనులు పరిశీలిస్తుండా పిట్ట గోడ పక్క నుంచి వెళుతున్న కరెంటు వైర్ తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని కుమారుడు పిల్లల కిషోర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై వివరించారు.


