
రామలక్ష్మిని రప్పించేందుకు ఏర్పాట్లు
అమలాపురం రూరల్: మస్కట్‌లో చిక్కుకున్న అయినవిల్లి మండలం విలస గ్రామానికి చెందిన సవరపు రామలక్ష్మిని స్వదేశానికి తీసుకురావాలన్న విన్నపంపై కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు స్పందించారు. విలసకు చెందిన రామలక్ష్మి మస్కట్లో చిక్కుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు తనను రక్షించి స్వదేశానికి తీసుకు రావాలంటూ విలపిస్తూ ఓ వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ ఈ ఏడాది మార్చి నెలలో ఉపాధి నిమిత్తం ఆమెను మస్కట్ పంపాడు. అక్కడ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇంటి యజమానులు తిండి సక్రమంగా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వాపోయింది. మస్కట్లో రామలక్ష్మి అక్కడి భారత రాయబార కార్యాలయం వద్దకు వెళ్లినా ఎవరూ స్పందించలేదని, అధికారులు ప్రజాప్రతినిధులు తనను రక్షించి స్వదేశానికి తీసురావాలని వేడుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె కుమారుడు సతీష్ తెలిపాడు. ఈ అంశంపై కలెక్టరేట్‌లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారి రమేష్ తక్షణమే స్పందించి భారత రాయబారం కార్యాలయం నుంచి రెండు రోజులలో ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసినట్లు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ నోడల్ అధికారి డీఆర్‌ఓ బీఎల్‌ఎన్ రాజకుమారి వెల్లడించారు.