కోనసీమ రైలుకు పచ్చజెండా | - | Sakshi
Sakshi News home page

కోనసీమ రైలుకు పచ్చజెండా

Jul 4 2025 3:44 AM | Updated on Jul 4 2025 3:44 AM

కోనసీ

కోనసీమ రైలుకు పచ్చజెండా

టీడీపీ సర్కారుకు

ముందు చూపు లేక

● తొలుత ఈ రైల్వేలైన్‌కు అమలాపురం భట్లపాలెం వద్ద రైల్వేస్టేషన్‌ రావాల్సి ఉంది. యూపీఏ ప్రభుత్వం హయాంలో రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన కూడా జరిగింది. అక్కడ నుంచి భైర్రాజు ఫౌండేషన్‌ భవనం మీదుగా కామనగరువు, రోళ్లపాలెం, పేరూరు పేరమ్మ అగ్రహారం మీదుగా బోడసుకుర్రు చేరాల్సి ఉంది. ఇప్పుడున్న జాతీయ రహదారి 216 బైపాస్‌కు, అమలాపురం పట్టణం మధ్య నుంచి ఈ లైన్‌ వెళ్లాల్సి ఉంది.

● 2014–19 మధ్యలో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రైల్వేలైన్‌కు ఇబ్బంది ఏర్పడుతోందనే ముందు చూపు లేకుండా 216 బైపాస్‌ నిర్మాణం చేశారు. దీంతో పాత రెల్వే ఆలైన్‌మెంట్‌ ప్రకారం ట్రాక్‌ నిర్మాణం చేస్తే పలుచోట్ల బైపాస్‌ రోడ్డును ఆనుకుని వెళుతోంది. దీనివల్ల రైల్వే లైన్‌ నిర్మాణం సాధ్యం కాదు. పైగా బైపాస్‌ నుంచి ఎక్కడ రోడ్డు దిగినా రైల్వే ట్రాక్‌ దాటుకుని పట్టణంలోకి రావాల్సి ఉన్నందున రైల్వేగేట్ల వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతాయి.

● ఇబ్బందులు గుర్తించిన గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం భట్నవిల్లి సమీపంలో బైపాస్‌ మొదలయ్యే ప్రాంతం కన్నా ముందు నుంచే రైల్వేలైన్‌ వెళ్లేలా చూడాలని నిర్ణయించింది. దీని ప్రకారం రైల్వేట్రాక్‌ నిర్మాణం జరిగేలా భూసేకరణకు ప్రతిపాదించింది. రైల్వేలైన్‌ భట్నవిల్లి, కామనగరువు, చిందాడగరువు, రోళ్లపాలెం, ఇమ్మిడివరప్పాడు, పేరూరుపేట మీదుగా బోడసకుర్రు వెళ్లనుంది.

● దీనివల్ల కేవలం రెండుచోట్ల జాతీయ రహదారి 216 దాటాల్సి వస్తుంది. ఈ ఆలైన్‌మెంట్‌కు సంబంధించి అధికారులు సర్వే చేపట్టారు. సర్వే పనులు వేగంగా జరిగాయి. కొత్త ఆలైన్‌మెంట్‌లో అడ్డుగా వచ్చే రోడ్లు, పంట కాలువలు, విద్యుత్‌ లైన్‌లు, స్తంభాలు, ఓఎన్జీసీ, గెయిల్‌ సంస్థల పైప్‌లైన్‌లు, నివాస గృహాలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ మంచినీటి పథకం పైప్‌లైన్‌లను ఈ సర్వేలో గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గత ప్రభుత్వ హయాంలో భూసేకరణకు రాజోలు దీవిలో సర్వే వేగంగా చేశారు.

కోనసీమ రైల్వేలైన్‌ ప్రాజెక్టుకు చిక్కుముళ్లు వీడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు సంబంధించి వేసిన కేసుల విషయంలో హైకోర్టు ఉదారంగా స్పందించింది. కొత్త, పాత అలైన్‌మెంట్‌కు సంబంధించి భూ సేకరణ, సర్వేల విషయంలో ఉన్న స్టే లను ఎత్తివేసింది. దీంతో సర్వే పనులు వేగంగా జరుగనున్నాయి. మూడు నదీపాయలపై నిర్మించాల్సిన వంతెనలకు సంబంధించి పిల్లర్లు పూర్తి కాగా, రైల్వేలైన్‌ ఏర్పాటుకు భూసేకరణ పూర్తయితే ప్రాజెక్టు నిర్మాణం వేగం పుంజకోనుంది.

భూసేకరణకు వీడిన ఆటంకాలు

కొత్త అలైన్‌మెంట్‌ సర్వేకు

లైన్‌ క్లియర్‌ చేసిన హైకోర్టు

సర్వేకు నిధులు కేటాయించిన గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

అప్పుడే మలికిపురం.. అమలాపురం మండలాల్లో మొదలైన సర్వే

ప్రతి ఏటా నిధులు సాధించిన

జగన్‌ సర్కారు

సాక్షి, అమలాపురం: కోనసీమ రైల్వేకు ఉన్న ప్రధాన అడ్డంకి వీడింది. రైల్వేలైన్‌ భూసేకరణ, రీ అలైన్‌మెంట్‌ సర్వేల విషయంలో గతంలో విధించిన స్టేని హైకోర్టు ధర్మాసనం బుధవారం ఎత్తివేసింది. దీంతో సర్వే పనులు తిరిగి వేగం అందుకోనున్నాయి. రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి కొత్త ఆలైన్‌మెంట్‌ వల్ల భూములు కోల్పోతున్న వారు కోర్టును ఆశ్రయించారు. శానపల్లిలంక నుంచి అమలాపురం భట్నవిల్లి వరకు 20 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన వారు తమకు పరిహారం విషయంలో అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. ఈ రెండు విషయాలపై గతంలో కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు వాటిని ఎత్తి వేయడంతో సర్వే పనులు జోరందుకోనున్నాయి.

కోనసీమ రైల్వేలైన్‌ నిర్మాణ పనులకు 2000లో శంకుస్థాపన జరిగింది. 2001లో తొలి అలైన్‌మెంట్‌ వచ్చింది. కాకినాడ నుంచి కోటిపల్లి, అమలాపురం, రాజోలు, సిద్ధాంతం మీదుగా నర్సాపురం వరకు ఈ రైల్వేలైన్‌ నిర్మాణం చేయాలని నాటి వాజ్‌పేయి సర్కార్‌ నిర్ణయించింది. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు పూర్తయిన రైల్వేలైన్‌ అక్కడ నుంచి నర్సాపురం వరకు రెండు దశాబ్ధాలు అవుతున్నా ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టు పనులు 2016 నుంచి తిరిగి ఊపందుకున్నాయి. గోదావరి మూడు నదీపాయలపై నిర్మించే వంతెనలకు సంబంధించి పిల్లర్ల పనులు పూర్తయ్యాయి. గౌతమీపై కోటిపల్లి– శానపల్లిలంకల మధ్య నిర్మిస్తున్న వంతెనకు గెడ్డర్లు, ఇతర ట్రాక్‌కు సంబంధించి టెండర్లు ఖరారై పనులు జరుగుతున్నాయి.

రైల్వేలైన్‌ మొత్తం పొడవు 102.507 కిమీలు. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు 45.30 కిమీల నిర్మాణం పూర్తికాగా, కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు 57.207 కిమీల వరకు నిర్మించాల్సి ఉంది. కోటిపల్లి నుంచి అమలాపురం శివారు భట్నవిల్లి వరకు 12.05 కిమీల వరకు గతంలో భూసేకరణ సైతం పూర్తయ్యింది. అమలాపురం నుంచి నర్సాపురం వరకు 45.157 కిమీల వరకు నిర్మించాల్సిన రైల్వేలైన్‌కు భూసేకరణ పెండింగ్‌లో ఉంది. దీనిలో వైనతేయ, వశిష్ఠలపై వంతెన నిర్మాణాలకు భూసేకరణ జరిగింది. మిగిలిన రైల్వే ట్రాక్‌కు, స్టేషన్ల నిర్మాణాలకు భూమి సేకరించాల్సి ఉంది.

భూసేకరణకు నిధులిచ్చిన

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

రైల్వే ప్రాజెక్టు భూసేకరణకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. సుమారు 600 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని అంచనా. నిధులు మంజూరు కావడంతో అప్పట్లోనే జిల్లా యంత్రాంగం అమలాపురం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలలో రైల్వేలైన్‌కు అవసరమైన భూమి గుర్తించేందుకు సర్వే చేపట్టింది. రైల్వేశాఖతోపాటు రెవెన్యూ అధికారులు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2020–21 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు రూ.1,490 కోట్లు కేటాయించారు. అంటే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి సగటున రూ.300 కోట్లు కేటాయించినట్టు. గత టీడీపీ పాలనలో 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2019–20 వరకు రూ.1,035 కోట్లు అంటే సగటున రూ.207 కోట్ల చొప్పున కేటాయించడం విశేషం.

కోనసీమ రైలుకు పచ్చజెండా1
1/2

కోనసీమ రైలుకు పచ్చజెండా

కోనసీమ రైలుకు పచ్చజెండా2
2/2

కోనసీమ రైలుకు పచ్చజెండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement