
గురుకుల పాఠశాలలో ఉడకని అన్నం
– ఎస్సీ హాస్టల్లో రుచిలేని భోజనాలు
అమలాపురం రూరల్: రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్, లక్ష్మిరెడ్డి బుధవారం రాత్రి అమలాపురం రూరల్ మండలం సమనస గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు భోజనాలు పెట్టే సమయంలో తనిఖీ చేయడంతో విస్తుబోయే నిజాలు వెలుగు చూశాయి. ఉడకని అన్నం విద్యార్థులకు పెట్టడాన్ని ఫుడ్ కమిషన్ సభ్యులు గుర్తించారు. విద్యార్థులు తినకుండా వదిలి వేయడంతో ఆరా తీసి ప్రశ్నించారు. దాంతో పలు లోపాలు ఉన్నట్లు ఫుడ్ కమిషన్ సభ్యులు గుర్తించారు. అనంతరం కామనగరువు బీవీ రమణయ్య కాలనీలో గల ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహాన్ని ఫుడ్ కమిషన్ సభ్యుల బృందం తనిఖీ చేసింది. గురుకుల పాఠశాలలో గుర్తించిన లోపాల కంటే మరింతగా అక్కడ సమస్యలు ఉన్నట్లు ఫుడ్ కమిషన్ సభ్యులు గుర్తించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తుంటే ఎస్సీ హాస్టల్లో మాత్రం గతంలో ఇచ్చిన బియ్యాన్ని వండి విద్యార్థులకు పెడుతున్నారు. అంతేకాకుండా వండిన కూరల్లో రుచి కనిపించలేదు. ఆ రుచి లేని ఆహారాన్ని విద్యార్థులకు పెట్టడం వల్ల పలువురు విద్యార్థులు భోజనాలు చేయనట్లుగా తనిఖీల్లో తేలింది. దాంతో ఫుడ్ కమిషన్ సభ్యులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఉపాధ్యాయులు, వార్డన్‌లపై చర్యలకు ఆదేశించారు.