
అట్టహాసంగా పట్టాల పండగ
●
● ఘనంగా జేఎన్‌టీయూకే 11వ స్నాతకోత్సవం
● కులపతి హోదాలో హాజరైన
గవర్నర్ అబ్దుల్ నజీర్
● బంగారు పతకాలు, పట్టాల ప్రదానం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ జేఎన్‌టీయూకేలో శుక్రవారం 11వ స్నాతకోత్సవం వర్సిటీ ఆవరణలో అట్టహాసంగా జరిగింది. అతిరథ మహారథుల మధ్య అత్యంత వైభవంగా కనుల పండువగా నిర్వహించారు. 16 సంవత్సరాల చరిత్ర కలిగిన జేఎన్‌టీయూ కాకినాడ ప్రాంగణం ఇందుకు వేదికగా నిలిచింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వర్సిటీ చాన్సలర్ హోదాలో హాజరయ్యారు. దీంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరిమిత సంఖ్యలో ఆహూతులతో కార్యక్రమం నిర్వహించారు. 2023 మే 31న 9వ స్నాతకోత్సవం, 2024 జనవరి 30వ తేదీ వర్సిటీ 10వ స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకాగా మళ్లీ ఇప్పుడు వరుసగా మూడవ సారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. బంగారు పతకాలు, పీహెచ్‌డీలు పొందేవారు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనడంతో ఆడిటోరియం కొత్త శోభను సంతరించుకుంది. వీసీ డాక్టర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ కళాశాల పూర్వ విద్యార్థి కోట సుబ్రహ్మణ్యంకు(సుబుకోటా)కు గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. గంటా ఐదు నిమిషాల పాటు జరిగిన కార్యక్రమంలో పటిష్ట బందోబస్తు మధ్య 40మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ఎండోమెంట్స్ అవార్డ్స్ అందజేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సెల్ఫీలతో సందడి చేశారు.
పరిమితంగా అనుమతి
ఆడిటోరియంలోకి పరిమిత సంఖ్యలో అనుమతించగా బయట ప్రత్యేకంగా ఎల్సీడీలు ఏర్పాటు చేసి లైవ్ ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలుత పతకాలు, పట్టాల గ్రహీతలతో వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గవర్నర్ అనుమతితో కార్యక్రమం ప్రారంభించారు. షెడ్యూల్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారని సమాచారం ఇవ్వగా ఆయన వేడుకలకు హాజరుకాలేదు. ముఖ్యఅతిథి శ్రీ కోట సుబ్రహ్మణ్యం (సుబు కోట)మాట్లాడుతూ సాంకేతిక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగుమెంటెడ్ రియాల్టీల ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు స్టార్టప్‌ల కోసం ఏర్పాటయ్యే ఇంక్యుబేషనన్ సెల్స్ విశిష్టతను తెలిపారు. రేపటి యూనికార్న్‌లుగా మారేందుకు సొంత స్టార్టప్‌లను ప్రారంభించాలనుకునే జేఎన్‌టీయూకే విద్యార్థులను ఆయన అభినందించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని చేపడుతున్న పరిశోధనల ద్వారా నూతన ఆవిష్కరణలు, ఐటీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ రంగాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు.
ఉప కులపతి ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో తీర్చిదిద్దాలని, మార్పులు చేయడంలో ధైర్యం, ధృడ నిశ్చయం, పెద్ద కలలు కనే సాహసం, సాంకేతిక కార్యకలాపాలలో లోతైన పరివర్తనకు ధైర్యం అవసరమని పట్టభద్రులకు సూచించారు. పరిశోధన కోసం నూతన కోణాలను అవలంబించాలని, సమాజ శ్రేయస్సు కోసం పరిశోధనా ప్రాజెక్ట్‌లను చేపట్టాలని కోరారు. పరిశ్రమ, విశ్వవిద్యాలయాలకు అనుసంధానంగా పాఠ్యాంశాలు, కోర్సు రూపకల్పనలు, పరిశ్రమలలో పరిశోధనలను జాతీయ విద్యా విధానం ప్రోత్సహిస్తుందన్నారు. పరిశోధక విద్యార్థులు, గ్రాడ్యుయేట్‌లు జాతీయ క్వాంటమ్ మిషన్‌లో పాల్గొని సమాజ ప్రయోజనం కోసం అధునాతన విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలన్నారు. అమృత్ కాల్‌కు సంబంధించి స్పష్టమైన విజన్‌ను రూపొందించడానికి, వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు అందరం కలిసి పనిచేద్దామన్నారు. అధిక కొవ్వు గల పదార్థాలను తీసుకోరాదని, పొగ తాగడం, మద్యం, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని, దీనికి ప్రతీ ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు.
అనంతరం ఉప కులపతి ప్రొ.సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను శాలువాతో సత్కరించి మెమెంటోను బహూకరించారు. ఈ స్నాతకోత్సవంలో 99 మంది రీసెర్చ్ స్కాలర్స్‌కు పీహెచ్‌డీ అవార్డులు అందజేశారు. కలెక్టర్ శ్రీ ఎస్.షణ్మోహన్, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ, రెక్టార్ కేవీ రమణ, రిజిస్ట్రార్ రవీంద్రనాఽథ్, నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ వీసీలు డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, కొప్పిరెడ్డి పద్మరాజు, శ్రీనివాసకుమార్, కే.మురళీకృష్ణ, శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

అట్టహాసంగా పట్టాల పండగ