
భూముల రక్షణలో యంత్రాంగం
● రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు
సేకరించిన భూమికి కంచె ఏర్పాటు
● అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం
సాక్షి, అమలాపురం: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన రైల్వే ప్రాజెక్టు.. జాతీయ రహదారుల కోసం సేకరించిన భూముల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా సేకరించిన భూములకు ఫెన్సింగ్, లేదా స్తంభాలు వేయాలని నిర్ణయించింది. రెండు దశాబ్దాల క్రితం సేకరించిన భూమికి సంబంధించి వివాదాలు తలెత్తడంతో ఈ నిర్ణయానికి వచ్చింది.
కోటిపల్లి – నర్సాపురం రైల్వే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అయినవిల్లి మండలం శానపల్లిలంక వద్ద గౌతమీ నది వంతెన నుంచి అమలాపురం మండలం భట్నవిల్లి వరకు రైల్వే శాఖ గతంలో భూమి సేకరించింది. దీనికి అప్పట్లోనే పరిహారం చెల్లించింది. సేకరించిన భూమి రైల్వే శాఖ పరిధిలోకి వచ్చినా ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టిలేదు. రైల్వేలైన్ కోసం సేకరించిన ఈ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. 2000లో మొదలైన ప్రాజెక్టు పనులకు 2016 వరకు పెద్దగా నిధులు కేటాయింపు జరగలేదు. ఇప్పుడు ప్రాజెక్టుకు నిధులు వచ్చి నిర్మాణాలు జరుగుతున్నా అవి కేవలం నదీపాయలపై మూడు వంతెనల నిర్మాణాలు మాత్రమే జరుగుతున్నాయి. దీనితో శానపల్లిలంక నుంచి భట్నవిల్లి వరకు సేకరించిన భూమి రికార్డులలో రైల్వే పరిధిలో ఉండగా వాస్తంగా అక్కడ రైతులు సాగు చేసుకుంటున్నారు. రెండు పుష్కరకాలాల తరువాత ఈ భూమిపై వివాదం రేగింది. ఇప్పుడు ఇస్తున్నట్టుగా పరిహారం ఇవ్వాలని కొంతమంది కోర్టును ఆశ్రయించడం, దీనిపై స్టే ఇవ్వడం జరిగింది. తాజాగా ఈ కేసులపై స్టేలను కోర్టు ఎత్తివేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రైల్వేలైన్‌కు సేకరించిన భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయడం, లేదా స్తంభాలు పాతడం చేయాలని నిర్ణయానికి వచ్చింది. దీనితోపాటు వైనతేయ, వశిష్ట నదీపాయలపై వంతెనలకు సేకరించిన భూములకు, కొత్తగా సేకరించే భూముల విషయంలో కూడా ఇదే తరహా అవలంబించాలని నిర్ణయించింది. పనిలో పనిగా జాతీయ రహదారి 216 ఈ, ఇతర నిర్మాణాలకు సేకరించిన భూముల పరిరక్షణకు సిద్ధమైంది. దీనిపై జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ దిశా నిర్దేశం చేశారు. ఈ ప్రక్రియలో ఎన్‌హెచ్, ఆర్‌అండ్‌బీ, రైల్వే శాఖలు భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం భూసేకరణ పురోగతిని పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, ఆర్డీవోలు పి.శ్రీకర్, కె.మాధవి, డి.అఖిల, ఎన్‌హెచ్ డీఈఈ టి.నిక్కి క్రేజీ పాల్గొన్నారు.

భూముల రక్షణలో యంత్రాంగం