
రేషన్‌షాపులకు చేరని బియ్యం
అయినవిల్లి: ప్రతి నెలా ఒకటో తేదీనే రేషన్ బియ్యం లబ్ధిదారులకు చేరేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెల రేషన్ బియ్యం వ్యాన్‌ల ద్వారా రేషన్ బియ్యం ఇవ్వడం నిలిపేసి పాత విధానంలో డీలర్ల ద్వారా లబ్ధిదారులకు రేషన్ బియ్యం ఇవ్వడం ప్రారంభించారు. ఈ నెల మూడోవ తేదీ దాటినా అయినవిల్లి మండలంలోని చాలా వరకూ షాపులకు రేషన్ బియ్యం దిగుమతి కాలేదు. దీంతో రేషన్‌షాపు యజమానులు చేసేది లేక లబ్ధిదారులను వెనుకకు తిరిగి పంపిస్తున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే ఒకటో తేదీనే రేషన్ బియ్యం ఇంటికి వచ్చేవని, కూటమి ప్రభుత్వం విధానం మార్చడంతో ఇబ్బంది పడుతున్నామని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపులకు వెళ్లి అక్కడ తలుపులకు తాళాలు దర్శన మిస్తున్నాయి. దీంతో పలువురు రెవెన్యూ అధికారులకు పరిస్థితి వివరించారు. మండలంలోని 41 రేషన్ షాపులు ఉండగా 30 శాతం షాపులకు మాత్రమే రేషన్ బియ్యం సరఫరా చేసినట్లు చెబుతున్నారు. గోడౌన్‌లో బియ్య సరఫరా లేకపోవడంతో ఆలస్యం అయిన మాటా వాస్తవమేనని, స్టాకు రాగానే మిగిలిన 70శాతం షాపులకు బియ్యం సరఫరా చేస్తామన్నారు.