ఆ ఇంట్లో పెద్ద కష్టం | - | Sakshi
Sakshi News home page

ఆ ఇంట్లో పెద్ద కష్టం

May 18 2025 12:12 AM | Updated on May 18 2025 12:12 AM

ఆ ఇంట్లో పెద్ద కష్టం

ఆ ఇంట్లో పెద్ద కష్టం

సైకిల్‌పై నుంచి పడిపోవడంతో ప్రమాదం

మంచానికే పరిమితమైన ఇంటి పెద్ద

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

కొత్తపేట: ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది.. రెక్కాడితే గాని డొక్కాడని ఆ ఇంటి పెద్ద ప్రమాదానికి గురై మంచాన పడటంతో అతని 15 ఏళ్ల కుమారుడిపైనే భారం పడింది. ఒకపక్క తండ్రికి వైద్యం, మరోపక్క కుటుంబాన్ని నెట్టుకురావడం ఈ బాలుడికి ఇబ్బందిగా మారింది. ఇలా నలుగురు సభ్యుల ఆ కుటుంబం తీవ్ర దయనీయ స్థితిలో ఉంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేట కొప్పిశెట్టివారి వీధికి చెందిన షేక్‌ అహ్మద్‌ యాకూబ్‌ ఆలీషా (48)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తాపీమేస్త్రి వద్ద కూలీగా పనిచేస్తూ ఆలీషా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. గతేడాది నవంబరులో ఒకరోజు రాత్రి కూలిపని ముగించుకుని సైకిల్‌పై ఇంటికి వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ హెడ్‌లైట్లు కాంతి కంట్లోకి కొట్టి కళ్లు కనిపించక సైకిల్‌ అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లో రాళ్లపై పడిపోయాడు. మెడ కింద వెన్నెపూస నరాలు నలిగిపోయి కాళ్లు చచ్చుబడిపోయాయి. మొదట్లో రావులపాలెంలో ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లగా కొన్ని రోజులు వైద్యం చేశారు. రోగం ముదిరిందే తప్ప తగ్గలేదు. తర్వాత అమలాపురంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వివిధ పరీక్షలు, కొన్ని రోజులు వైద్యం చేసి ఆపరేషన్‌ పడుతుందని, రూ.6 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఆపరేషన్‌కు రూ.30 వేలు మాత్రమే వస్తుందని, మిగిలింది బాధితులే భరించాలన్నారు. అప్పటికే అప్పులు చేసి, బంధువులు, తెలిసిన వారు చేసిన సాయంతో సుమారు రూ.3 లక్షల వరకూ ఖర్చు చేశారు. కానీ ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. సరికదా అనారోగ్యం ముదిరి పక్షవాతం వచ్చింది. ఇక ఆర్థిక స్తోమత లేక కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షలు చేసి ఆపరేషన్‌ చేస్తాం కానీ పూర్తిగా కోలుకుంటాడని చెప్పలేమని అక్కడి వైద్యులు చెప్పారని బంధువులు అంటున్నారు. దాంతో వద్దని చెప్పడంతో కొన్ని రోజులు వైద్యం చేసి డిచ్చార్జ్‌ చేశారు. నడవలేక మంచానికే పరిమితమైన ఆలీషాను నెలా, రెండు నెలలకోసారి ఫిజియోథెరపీకి కాకినాడ తీసుకు వెళుతున్నారు. వెళ్లిన ప్రతిసారి అంబులెన్స్‌కు రూ.10 వేలు, అక్కడ సిబ్బందికి రెండు, మూడొందలు ఇవ్వాల్సి వస్తుందని అతని భార్య బీబీజా వాపోయారు. భర్త మంచాన పడి, ఆదాయం లేకపోవడంతో పదో తరగతి పాసైన కుమారుడిపైనే వైద్యం ఖర్చులు, కుటుంబ పోషణ పడిందన్నారు. చదువుకు స్వస్తి చెప్పి కూలి పనికి వెళ్తున్నాడని, అయ్యే ఖర్చులకు తన కొడుకు సంపాదన సరిపోక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని బీబీజా ఆవేదనతో చెప్పారు. మంచాన పడిన వారికి ఇచ్చే పింఛను కోసం సదరం క్యాంపునకు వెళితే, 83 శాతం అంగవైకల్యం అని సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు. కానీ టెంపరరీ అని రాశారని, దీనివల్ల పింఛను రాదన్నారని బీబీజా వాపోయారు. దీనావస్థలో ఉన్న ఈ కుటుంబానికి దాతలు ఆపన్నహస్తం అందించాలని స్థానిక పీఎంపీ షేక్‌ హైదర్‌, మెడికల్‌ రిప్రజంటేటివ్‌ షేక్‌ మక్బుల్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement