
ఎయిడ్స్ మృతులకు కొవ్వొత్తులతో నివాళి
అమలాపురం టౌన్: అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలాపురం హైస్కూల్ సెంటర్ నుంచి గడియారం స్తంభం వరకూ ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తొలుత దీనిని జిల్లా కుష్టు వ్యాధి, ఎయిడ్స్ అండ్ టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సీహెచ్‌వీ భరతలక్ష్మి ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఎయిడ్స్‌తో చనిపోయిన వారికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అలాగే హెచ్‌ఐవీతో జీవిస్తున్న రోగులకు అండగా నిలుస్తూ సంఘీభావం ప్రకటించారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖతోపాటు వైద్యులు, సిబ్బంది, జిల్లా ప్రజలు అండగా నిలుస్తారని భరతలక్ష్మి తెలిపారు. గడియార స్తంభం సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్ నివారణ అంశాలపై ప్రతిజ్ఞ చేశారు. ఎయిడ్స్ వ్యాధి సోకిన వారి పట్ల వివక్ష వద్దని సూచించారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సూపర్‌వైజర్ ఎ.బుజ్జిబాబు, ఏఆర్‌టీ వైద్యాధికారులు, జిల్లా టీబీ నియంత్రణ సిబ్బంది, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్‌ఐవీ, ఎయిడ్స్ సిబ్బంది, కోస్టల్ పాజిటివ్ పీపుల్ సంస్థ సిబ్బంది, ఐసీటీసీ అండ్ డీఆర్‌ఆర్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.