
మండు వేసవిలో కరెంట్ కోతలా!
సీపీఐ జిల్లా కార్యదర్శి సత్తిబాబు
అమలాపురం టౌన్: జిల్లాలో 132 కేవీ డబుల్ సర్క్యూట్ విద్యుత్ లైన్లకు సంబంధించి 30 టవర్ల మరమ్మతుల పేరుతో ఈ నెల 20 నుంచి జూన్ 5వ తేదీ వరకూ కరెంట్ కోతలు ప్రకటించడం పట్ల జిల్లా సీపీఐ కార్యదర్శి కె.సత్తిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు అమలాపురంలో ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పగలు విద్యుత్ కోతలు అమలు చేయడం పట్ల గృహ వినియోగదారులే కాకుండా ఆక్వా, వ్యవసాయదారులు, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, ధాన్యం మిల్లులు, తాగునీటి ప్రాజెక్ట్‌లు ఇలా పలు రంగాలు ఇబ్బంది పడతాయని ఆయన గుర్తు చేశారు. 30 టవర్ల రిపేర్లతో జిల్లాలోని అమలాపురం పట్టణంతోపాటు 15 మండలాల్లో ఈ విద్యుత్ సరఫరా నిలిపివేత ప్రభావం ఉంటుందన్నారు. నూతన సాంకేతికతతో 10 టవర్ల చొప్పున రిపేర్లు చేపడితే 3 లేదా 4 రోజుల్లో రిపేర్లు పూర్తి చేసే ఆలోచనను పరిగణనలోకి తీసుకోవాలని సత్తిబాబు సూచించారు. అవసరమైతే ఇతర జిల్లాల నుంచి టెక్నీషియన్లను అదనంగా రప్పించుకుని పనులు పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం ఉదయం 10 గంటల నుంచి జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చన్నారు. ప్రజల సౌకర్యార్థం మూడు రెవెన్యూ డివిజన్‌ల్లో 22 మండల కేంద్రాలు, నాలుగు మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు ఆయా స్థాయిల్లో తమ సమస్యలను నమోదు చేసుకుని పరిష్కారం పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అర్జీదారులు 1100 కాల్ సెంటర్ ద్వారా తమ ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే అడగవచ్చన్నారు. కొత్త ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని వివరించారు.
కాళేశ్వరం పుష్కరాలకు ప్రత్యేక బస్సు
అమలాపురం రూరల్: కాళేశ్వరంలో సరస్వతీ నదీ పుష్కరాలకు జిల్లా నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి ఆదివారం రాత్రి ప్రత్యేక బస్సును ప్రారంభించామని డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాత్ర బస్సు వరంగల్, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, రామప్ప దేవాలయాలతో పాటు ముఖ్యంగా సరస్వతి నదిలో పుష్కర స్నానం చేసేటట్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ బస్సులకు ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, రిజర్వేషన్ కోసం 99592 25576, 99592 25550, అసిస్టెంట్ మేనేజర్ 70138 68687 ఫోన్ నంబర్లను సంప్రదించాలని డీఎం వివరించారు. సూపర్ లగ్జరీ బస్సు టిక్కెట్ ధర రూ.2,200, ఇంద్ర ఏసీ బస్సు టిక్కెట్ ధర రూ.2,700గా నిర్ణయించామన్నారు. బస్సుకు సరిపడా ప్రయాణికులు ఉంటే వారి గ్రామం నుంచే నేరుగా బస్సును పంపిస్తామని తెలిపారు.