
సబ్ ప్లాన్ టెండర్లు ఎస్సీలకే కేటాయించాలి
విదసం, రాజోలు ప్రదర్శన చైతన్య సమితి డిమాండ్
మలికిపురం: రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేసే అభివృద్ధి పనులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు అవసరమయ్యే సరకుల సరఫరా టెండర్లు దళితులకే కేటాయించాలని విస్తృత దళిత సంఘాల (విదసం), ఐక్య వేదిక రాష్ట్ర సమితి సమావేశం డిమాండ్ చేసింది. బుధవారం విదసం ఐక్యవేదిక రాష్ట్ర సమితి, రాజోలు పరిరక్షణ సమితి సంయుక్త సమావేశం మలికిపురం మండలం శంకరగుప్తంలో సభ్యులు చింతా సత్య ఇంటి వద్ద జరిగింది. విదసం కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ సక్రమ అమలు కోసం ప్రభుత్వం ఎస్‌టీఎస్ (సబ్ ప్లాన్ టెండర్లు ఎస్సీలకే) అనే కొత్త స్కీమ్ ప్రవేశ పెట్టాలని సలహా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న 750 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, 50 రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న లక్షా నాలుగు వేల మంది విద్యార్థులకు పప్పులు, నూనెలు, కూరగాయలు, గుడ్లు, మాంసం సరఫరా కోసం కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లు చెల్లిస్తోందని, ఈ సరఫరా దారుల్లో ఒక్క టెండర్లో కూడా దళితుడు లేడన్నారు. రాష్ట్రంలో మొత్తం 55,600 అంగన్వాడీలు ఉంటే దళిత వాడల్లో 12 వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని వాటికి గుడ్లు, చెక్కీలు, పప్పులు, నూనెల సరఫరాకు ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి రూ.372 కోట్లు కేటాయిస్తే ఆ కాంట్రాక్టులు అన్ని అగ్రకులాల చేతుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. హాస్టళ్లు, దళితవాడల్లో అంగన్వాడీలకు సరకులు సరఫరా టెండర్లు దళితులకు ఇస్తే 1,000 నుంచి 1500 కుటుంబాలకు జీవనోపాధి కల్పించవచ్చని అన్నారు. సబ్‌ప్లాన్ నిధుల నుంచి పంచాయతీరాజ్‌కి రూ.1,900 కోట్లు, వ్యవసాయశాఖకు రూ.1,289 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.1,600 కోట్లు సబ్ ప్లాన్ నిధులతో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తోందని ఈ కాంటాక్టులలో కూడా దళితులు ఎవరూ లేరన్నారు. నిరుద్యోగ దళిత యువకులను సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఏర్పాటు చేసి అవసరమైన శిక్షణ ఇచ్చి అభివృద్ధి పనులు అప్పగిస్తే వేల దళిత కుటుంబాలు ఆర్థికంగా పురోగమిస్తాయన్నారు. సభాధ్యక్షుడు నల్లి ప్రసాద్‌రావు, మందా సత్యనారాయణ మాట్లాడుతూ అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణలో లొసుగులు సరిదిద్ది జీ ఓ 596 తిరిగి అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. రేవు తిరుపతిరావు మాట్లాడుతూ ఇంగ్లిషు మీడియం కొనసాగించాలన్నారు. రాజోలు పరిరక్షణ చైతన్య సమితి చింతా సత్య మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కులగణన పూర్తయ్యే వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ ప్రక్రియ నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. కొంకి రాజామణి , ముత్యాల శ్రీనివాస్, జాజి ఓంకార్, గుడివాడ ప్రసాద్, ఉప్పాడ రాము పాల్గొన్నారు.