
ఏపీ ఫైబర్‌నెట్ కేబుల్ ఆపరేటర్ల ధర్నా
అమలాపురం రూరల్: ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థ కార్యకలాపాలు దీన స్థితిలో ఉన్నాయని తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కేబుల్ ఆపరేటర్లు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థను కాపాడి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ రాజకుమారికి సంఘం నాయకులు మాడాలక్ష్మి దుర్గప్రసాద్, లంకలపల్లి తాతాయ్యనాయుడు, ఇళ్ల కృష్ణ, గుమళ్ల పుల్లయ్యనాయుడు, అల్లు నాగేశ్వరరావు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ రోజువారీ అత్యవసర సర్వీసెస్ అయిన ఆన్‌లైన్ వర్క్ ఫ్రమ్ హెూమ్, డిజిటల్ చెల్లింపులు, స్కిల్ డెవలప్‌మెంట్, వీడియో కాన్ఫరెన్స్, ఇతర ఇంటర్నెట్ ఆధారిత సేవలు అందక జనం తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారని అన్నారు. ఉద్యోగులను తొలగించడంతో సాంకేతికంగా ఇబ్బందులు పరిష్కరించే సిబ్బంది లేక కేబుల్ అపరేటర్లు నష్టపోతున్నారని వారు తెలిపారు.