
నర్సింగ్ నైటింగేల్!
కపిలేశ్వరపురం: సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి సంపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యంతో జీవించాలి. రోగభయం లేని సమాజానికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. జనాభా, ఆరోగ్య ప్రమాణాల ప్రాతిపదికన తగినన్ని ఆస్పత్రులను, వైద్యులను, సిబ్బందిని నియమించాలి. వారి పూర్తి సేవలు రోగులకు అందేలా సహకరించాలి. వైద్యం ఎంత ఉన్నతంగా చేసినా సిబ్బంది, నర్సుల సహకారం లేకపోతే అంతా వృథా అయినట్టే. సమాజ ఆరోగ్య పరిరక్షణలో నర్సుల పాత్ర ఎంతో కీలకం.
ఉమ్మడి జిల్లాలో నర్సులు ఇలా..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 135 పీహెచ్‌సీలు, 22 సీహెచ్‌సీలు, 7 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. కాకినాడలో జీజీహెచ్, రాజమహేంద్రవరంలో ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నాయి. ప్రభుత్వ, గ్రామీణ, అర్బన్ సీహెచ్‌సీల్లో 1,445 మంది హెల్త్ సెక్రటరీలున్నారు. 200 మంది ఏఎన్‌ఎంలు, 473 మంది స్టాఫ్ నర్సులు, 1232 మంది ఎంఎల్‌హెచ్‌పీలు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,396 మంది ఆశా కార్యకర్తలు పని చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 480, కాకినాడ జిల్లాలో 450, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 165 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులుగా పనిచేస్తున్నారు.
నర్సుల డిమాండ్లు వినేవారేరీ!
ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల తీరు ఆందోళనకరంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఆస్పత్రులు నడుస్తున్నాయి. ప్రతి వెయ్యి మంది జనానాకు ముగ్గురు నర్సులు చొప్పున ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన నిర్దేశకాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నర్సులపై పనిభారం అధికమవుతోంది. కార్మిక చట్టానికి భిన్నంగా వారు 8 గంటలకు బదులు 11 గంటలు పని చేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు పని ప్రదేశంలో ప్రత్యేక సదుపాయాలు లేవు. హెల్త్ సెక్రటరీలకు వైద్య సేవలకు తోడు ఇతర ప్రభుత్వ అనుబంధ పనులు సైతం చెప్పడంతో వైద్య సేవల్లో నాణ్యత కొరవడుతోంది. ఉద్యోగ ఉన్నతి ప్రక్రియ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిలిచిపోవడంతో నర్సులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాకినాడ జీజీహెచ్‌లో ఐసీయూ విభాగంలో ఒక్కో బెడ్‌కు ముగ్గురు చొప్పున నర్సులు ఉండాలన్నది ఆచరణకు నోచుకోవడంలేదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా సేవలందిస్తు ఆశా కార్యకర్తలు క్షేత్ర స్ధాయిలో వేధింపులకు గురవుతున్నారు. మార్చి 1న నిర్వహించిన ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో గ్రాట్యుటీ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, 30 ఏళ్ల సర్వీసు ఉంటేనే రూ.1.5 లక్షల గ్రాట్యుటీ ఇస్తామంటూ మెలిక పెట్టింది. 2024 డిసెంబర్‌లో సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఆందోళనలు చేశారు. వారి పోరాటాన్ని వేధింపులు, పోలీస్ చర్యలతో అణచివేసింది. పలు దఫాలుగా నిర్వహించిన నర్సుల ఉద్యమాలు ఫలితంగా ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచింది. 180 రోజుల ప్రసూతి సెలవులకు అంగీకరించింది.
నర్సుల దినోత్సవ నేపథ్యం ఇదీ...
1820, మే 12న ఇటలీలో ధనిక కుటుంబంలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజును ప్రపంచ నర్సుల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ నర్సెస్ 1965లో నర్సింగ్ డేను గుర్తించింది. యుద్ధ సమయంలో గాయాలపాలైన వారికీ, ప్రకృతి వైపరీత్యాలకు గురైనవారికీ ధైర్య సాహసాలతో వైద్య సేవలందించడంలో నర్సింగ్‌లో నైటింగేల్ తీసుకువచ్చిన సంస్కరణలు ఎంతో దోహదం చేశాయి. ఆమె రాసిన రచనలు వైద్యరంగాన్ని మరో మెట్టు ఎక్కించాయి. నైటింగేల్ ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సెస్ పేరుతో సంస్థను స్థాపించి ఎందరో నర్సులను తయారు చేశారు. 1910 ఆగస్టు 13న లండన్‌లో ఆమె మృతి చెందారు.
వైఎస్సార్ సీపీ హయాంలో ఆస్పత్రుల ప్రగతి
స్వాతంత్య్రం వచ్చాకా రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ఏర్పాటైతే, వైఎస్సార్ సీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను తీసుకొచ్చింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ విధానంతో ప్రైవేటుపరం చేయాలని చూస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నర్సింగ్ కౌన్సిల్‌తో ఎంవోయూ కుదుర్చుకుని నర్సింగ్ కోర్సులు చేసిన యువతలో నైపుణ్యాల పెంపునకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. 2019 ఆగస్టులో ఆశాల వేతనాలను రూ.10 వేలకు పెంచారు.
సేవే లక్ష్యం, ప్రేమే మార్గంగా రోగుల సేవ ప్రపంచానికి ఆదర్శంగా నిలచిన ఫ్లోరెన్స్ ఆమె మార్గంలో నేడు ఎందరో పయనం వారి శ్రేయస్సు ప్రభుత్వాల కనీస బాధ్యత
మాటే మంత్రం.. మంత్రం లక్షణం.. మనసుపై బలమైన ముద్రవేసి సమస్య పరిష్కరించడం. ఈ లక్షణాన్ని నూరు శాతం కలిగి ఉన్న మన ఊరి మంత్రసాని ఆమె. కాలక్రమంలో నామాంతరం.. రూపాంతరం చెంది నర్సులుగా సమాజ సేవ చేస్తోంది. రోగం ఎంత క్షిష్టమైనదైనా.. రోగి శరీరం.. మనసు ఎంత అవసానంలో ఉన్నా తన అనునయ వాక్యాలతో మనసును ఊరడించి రోగభయాన్ని తగ్గించి మానసికంగా రోగం తగ్గడానికి ఉద్యుక్తుడిని చేసి వైద్యుడు ఇచ్చిన ఔషధం ఒంటబట్టేలా చేస్తుంది. ఎంత పెద్ద ఆస్పత్రి అయినా.. వైద్యుడు ఎంతటి ప్రవీణుడైనా ఆమె మాటల అనుపానం లేకపోతే ఎందరో రోగులు అంత తీవ్రతరమైన రోగం లేకపోయినా మానసిక భయంతో విలువైన ప్రాణాలు కోల్పోయేవారు. ఎంతో దూరం పోనవసరం లేకుండా ఇటీవల కొన్ని వేల మందిని కబళించిన కరోనాయే ఇందుకు సాక్ష్యం. ఆ కష్టకాలంలో ఎందరో రోగులు మానసికమైన ఒత్తిడిని తట్టుకోలేకే మృతి చెందారన్నది నిర్వివాదాంశం. సరైన వైద్యాన్ని సకాలంలో అందిస్తూ సేవ చేసే మంత్రముగ్ధలైన నర్సులు నిజమైన సమాజ సేవకులు. వారికి ప్రేరణ.. ఆదర్శం ఫ్లోరెన్స్ నైటింగేల్. నిజంగా ఆమె సార్థకనామధేయురాలు. నైటింగేల్ అంటే మధురమైన గానం చేసే పక్షి అని అర్థం. ఆమె మాటల ప్రభావం ఎంతటిదో ప్రపంచం నేడు గుర్తిస్తోంది. ఇటలీలో జన్మించి ఐర్లాండులో నర్సింగ్‌లో సంస్కరణలకు నాంది పలికిన మహోన్నత సేవా శిఖరం. నేడు ఆమె జయంతిని పురస్కరించుకుని నర్సుల దినోత్సవం సందర్భంగా కథనం.
చాకిరీ మూరెడు... వేతనం బెత్తెడు...
నర్సులు ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు 12 గంటలు పాటు సేవలందిస్తున్నారు. నెలకు వారికి ఇచ్చే వేతనం రూ.15 వేల లోపే. ప్రభుత్వ రంగంలోని నర్సులు సైతం వేతనాలు పెంచాలన్న డిమాండ్ అపరిష్కృతంగానే ఉంది. పీఎంఎంవీవై పథకం ద్వారా గర్భిణులను ప్రతి నెలా 9న ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్య పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కిల్కారీ, మొబైల్ అకాడమీ సేవల్లో నర్సులు భాగస్వాములవుతున్నారు. జిల్లాకు సుమారుగా ఐదు వేల మంది చిన్నారుల చొప్పున ప్రతి నెల బుధ, శనివారాల్లో క్రమం తప్పకుండా టీకాలు వేస్తున్నారు.
వైద్య, ఆరోగ్య సేవలకు అవకాశం కల్పించాలి
పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు చేసేందుకు పూర్తి స్ధాయిలో అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా సచివాలయ పరిధిలోని పనుల భారాన్ని మోపడం సరికాదు. హెల్త్ సెక్రటరీలను యాప్‌ల నిర్వహణకు మినహాయించాలి. ఫీల్డ్ వర్క్‌లో ఉన్నందున ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– జి.నాగ వరలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ యునైటెడ్ విలేజ్ అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ వెల్ఫేర్ అసోసియేషన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ

నర్సింగ్ నైటింగేల్!

నర్సింగ్ నైటింగేల్!

నర్సింగ్ నైటింగేల్!