
జాతీయ చదరంగం పోటీలకు సాన్వీ
అమలాపురం రూరల్: గుంటూరులో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి చదరంగం అండర్ – 7 పోటీల్లో అమలాపురంలోని కామనగరువు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న బి.సాన్వీ అత్యుత్తమ ప్రతిభ చూపి, 5 బై 6 పాయింట్లు సాధించింది. రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచి జాతీయ చదరంగ పోటీలకు అర్హత సాధించింది. ఆమెకు కోనేరు హంపి తల్లిదండ్రులైన అశోక్, లత చేతుల మీదుగా ట్రోఫీ అందించారు. ఈ నేపథ్యంలో ఒడిశాలో జూన్‌లో జరిగే జాతీయ పోటీల్లో సాన్వీ పాల్గొంటుందని కోచ్ వి.శ్రీనుబాబు తెలిపారు. సాన్వీని స్కూల్ డైరెక్టర్ నంద్యాల మనువిహార్, ప్రిన్సిపాల్ దేవీదీక్షిత్ శనివారం అభినందించారు.
కాలువలో పడి మహిళ మృతి
కాకినాడ రూరల్: మండలంలోని సూర్యారావుపేట పరకాలువలో పడి పితాని రమణమ్మ (57) మృతి చెందింది. తిమ్మాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాలువకు చెందిన రమణమ్మ ఉపాధి హామీ కూలీగా పనిచేస్తుంది. ఆమె భర్త గతంలోనే చనిపోయాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న రమణమ్మ ఈ నెల 7న ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యు లు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరకాల్వ తూటి కాడపై ఆమె మృతదేహం శనివారం స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిమ్మాపురం ఇన్‌చార్జి ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో..
ముమ్మిడివరం: ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొని బైక్‌పై వెళుతున్న యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. అల్లవరం మండలం కోడూరుపాడు శివారు నక్కల పుంతకు చెందిన సవరపు నాగబాబు (28) శనివారం సాయంత్రం యానాం వెళ్లి తిరిగి వస్తున్నాడు. నగర పంచాయతీలోని కొండాలమ్మ గుడి వద్ద 216 జాతీయ రహదారిపై అమలాపురం నుంచి వస్తున్న వ్యాన్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగబాబుకు భార్య రేణుక, ఇద్దరు పిల్ల లు ఉన్నారు. ఈ మేరకు ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.