
అక్కడ అంతా క్షేమమేనా..
● ఇక్కడ స్థిరపడిన రాజస్థానీయుల ఆవేదన
● తమ వారి యోగక్షేమాలపై ఆరా
పిఠాపురం: పాకిస్థాన్‌తో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఆ దేశ సరిహద్దులోని మన రాష్ట్రాల్లో హై అలర్టు ప్రకటించారు. బ్లాక్ అవుట్లు, సైరన్ల మోతతో ఆ ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో మన ప్రాంతంలో స్థిరపడిన రాజస్థానీయులు అక్కడి తమ వారి కోసం ఆందోళన చెందుతున్నారు. వీరందరూ వివిధ వ్యాపారాల కోసం రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి అనేక ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో తమ స్వగ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నారు. అక్కడి వారి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్‌లోని బార్‌మీర్, జైసల్మేర్, పోక్రాన్ వంటి ప్రాంతాలకు చెందిన తమ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. మూడు రోజులుగా ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. భారత ఆర్మీ తమకు అండగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేకుండా చూస్తున్నారని అక్కడి వారు తమ బంధువులకు సమాచారం ఇస్తున్నారు.