
వ్యర్థానికి కట్టలతో అర్థం
పశువులు ఇష్టంగా తింటున్నాయి
వరికోత యంత్రాలతో కోసిన గడ్డిని పశువులు ఇష్టంగా తింటున్నాయి. యంత్రాలతో వరికోతలు అధికంగా ఉండడంతో ఆ గడ్డినే వినియోగిస్తున్నాం. యంత్రాలతో కట్టలు కట్టించి, గడ్డివాములుగా వేస్తున్నాం.
– నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, పాడి రైతు,
పసలపూడి, రాయవరం మండలం
కొరతను అధిగమిస్తున్నారు
యంత్రాలతో కోసిన ఎండు గడ్డిని కట్టలుగా కట్టి వాటిని రైతులు పశుగ్రాసంగా ఉపయోగిస్తున్నారు. గడ్డిని కట్టలుగా చుట్టే యంత్రాల వినియోగం పెరగడంతో ఎండు గడ్డి కొరతను అధిగమిస్తున్నారు. గడ్డిని కట్టలు కట్టే యంత్రాలు రావడంతో ఎండు గడ్డి వృథా తగ్గింది. రవాణా, వినియోగం సులువుగా మారింది.
– ఎ.నాగశ్రావణి, మండల పశువైద్యాధికారి, రాయవరం మండలం.
ఎండుగడ్డిని ట్రాక్టర్లపై తరలిస్తున్న రైతులు
● యంత్రాలతో కోసిన పశుగ్రాసానికి
పెరుగుతున్న క్రేజ్
● ఎండు గడ్డిని కట్టలుగా కట్టి
వినియోగిస్తున్న రైతులు
రాయవరం: యంత్రాలతో కోసిన వరిగడ్డిని గతంలో చేలల్లోనే వదిలి వేసేవారు. రైతులు వ్యర్థంగా భావించిన గడ్డిని తగులబెట్టేవారు. అయితే ఇటీవల కాలంలో యంత్రాలతో కోసిన గడ్డిని కట్టలుగా కట్టి పశుగ్రాసంగా వాడుతున్నారు. ఇప్పుడు 98 శాతం మంది రైతులు యంత్రాలతో వరికోతలు కోస్తున్నారు. దీంతో పాడి రైతులు వరికోత యంత్రాలతో కోసిన గడ్డిని కట్టలుగా కట్టి, పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. సాగులో భూమిని దమ్ము చేయడం నుంచి నాట్లు వేయడం, పురుగుమందుల పిచికారీ, పంట మాసూళ్ల వరకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వరి కోత యంత్రాలతో కోసిన పొలాల్లో ఉన్న గడ్డిని కట్టలు కట్టడానికి సైతం యంత్రాలనే వినియోగిస్తున్నారు.
తీరుతున్న ఎండుగడ్డి కొరత
దాళ్వా సీజన్లో పంట మాసూళ్లకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. యంత్రంతో పంట మాసూళ్లు చేయడం వల్ల వరి గడ్డి.. ముక్కలు ముక్కలుగా మారిపోతుంది. గతంలో ముక్కలుగా మారిన గడ్డిని పశువులకు మేతగా వేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని రైతులు గడ్డిని చేలల్లోనే తగులబెట్టేవారు. దీంతో పాడి రైతులు పశువులకు మేతగా ఉపయోగించే ఎండుగడ్డికి కొరత ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గడ్డి కొరత కారణంగా ఎకరం గడ్డి సుమారు రూ.6,000 నుంచి రూ.8,000 వరకు ధర పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు వరి కోత యంత్రాలతో మాసూలు చేసిన గడ్డి పశువులకు ఉపయోగంగా ఉంటుందని, ముక్కలైన గడ్డి పశువులు తినడం వల్ల త్వరగా జీర్ణమవుతుందని రైతులకు అవగాహన కల్పించారు. రైతులు యంత్రాల ద్వారా మాసూలు చేసిన వరి పంట గడ్డిని పశువులకు మేతగా ఉపయోగించడాన్ని అలవాటు చేసుకున్నారు. సాధారణ వరికోతలు కోసిన ఎండు గడ్డికి, యంత్రాలతో కోసిన ఎండు గడ్డికి మధ్య పోషకాల్లో ఎటువంటి తేడా ఉండదని పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
జిల్లాలో 2.29 లక్షల పశు సంతతి ఉంది. వీటిలో 75,460 ఆవులు, 1,53,542 గేదెలు ఉన్నాయి. పశువులు కూడా ఇష్టంగా తినడంతో వరి కోత యంత్రాల ద్వారా మాసూలు చేసిన వరి గడ్డిని దాణాగా ఉపయోగిస్తున్నారు. గడ్డి కట్టలు కట్టడానికి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఉన్న యంత్రాలతో పాటుగా, ఇతర జిల్లాల నుంచి యంత్రాలు మన ప్రాంతానికి వస్తున్నాయి. గడ్డిని ప్రత్యేక యంత్రం ద్వారా కట్టలు కట్టించి ట్రాక్టర్లతో గట్టుకు చేర్చి గడ్డివాములుగా వేస్తున్నారు. యంత్రం ద్వారా కట్టలు కట్టడానికి ఒక్కో కట్టకు 35 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికితోడు రవాణా, కూలి ఖర్చులు తోడవుతున్నాయి. దీంతో యంత్రం ద్వారా ఎకరం గడ్డి కట్టలు కట్టించడానికి సుమారు రూ.2,000 వరకు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు.
పొలాల్లో కట్టలుగా కట్టిన ఎండుగడ్డి

వ్యర్థానికి కట్టలతో అర్థం

వ్యర్థానికి కట్టలతో అర్థం