
కార్పొరేట్ లాభాల కోసమే లేబర్ కోడ్‌లు
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు
కాకినాడ సిటీ: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం యూటీఎఫ్ హోంలో జరిగిన జిల్లా కార్మిక సంఘాల జిల్లా సదస్సులో వారు మాట్లాడారు. మోదీ మతోన్మాద ప్రభుత్వం భారతీయ కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు బానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్ కోడ్‌లు తెచ్చిందని విమర్శించారు. స్వతంత్రానికి ముందుగానీ, తర్వాత గానీ వచ్చిన కార్మిక చట్టాలు ఒకరి దయతో వచ్చినవి కాదని, వేలాది మంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్నవని గుర్తు చేశారు. మూడు నల్ల చట్టాలతో రైతులను, నాలుగు లేబర్ కోడ్‌లతో కార్మికులను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కరోనా సంక్షాభాన్ని, ఉగ్రవాద సంక్షోభ పరిస్థితులను మోదీ మతోన్మాద ఎజెండాను అమలు పరిచేందుకు, కార్పొరేట్ శక్తులను సంతృప్తి పరిచేందుకు వాడుకుంటోందని విమర్శించారు. సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్, ఎల్‌ఐసీ, పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్ పాల్గొంటున్నాయని, ప్రభుత్వ పథకాలలో పని చేసే ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు కూడా సమ్మెను బలపరచాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రాజు, ఏఐసీసీటీయూ రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాల నాయకులు చెక్కల రాజ్‌కుమార్, కాళ్ల నాగేశ్వరరావు, షేక్ పద్మ, మలకా రమణ, నక్కెళ్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు, మేడిశెట్టి వెంకటరమణ, చంద్రమళ్ల పద్మ, వేణి, వెంకటలక్ష్మి, గుబ్బల ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు. సదస్సు ప్రారంభోత్సవానికి ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.