
ఉత్కంఠగా అండర్–7 చెస్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా అండర్–7 చెస్ పోటీలు స్థానిక విక్టరీ అకాడమిలో బుధవారం ఉత్కంఠగా జరిగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఏడేళ్ల లోపు క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటారు. జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్, విక్టరీ అకాడమి ఇన్‌చార్జి తాడి శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు జరిగాయి. జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటిన బాలుర, బాలికల విభాగంలో ఐదుగురిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అండర్–7 చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో వారు తలపడనున్నారు. బాలుర విభాగంలో రామచంద్రపురం రూరల్ మండలం ద్రాక్షారామకు చెందిన పాయసం వికాస్ (ప్రథమ), కాట్రేనికోనకు చెందిన విత్తనాల కుశాల్ (ద్వితీయ), అమలాపురానికి చెందిన యతిరాజుల రిషిత్ (తృతీయ) విజేతలుగా నిలిచారు. బాలికల విభాగంలో ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లికి చెందిన బొడ్డు సాన్వి (ప్రథమ), రావులపాలేనికి చెందిన బి.హిమబిందు (ద్వితీయ) స్థానాలను కై వసం చేసుకుని రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
రాష్ట్ర స్థాయి
పోటీలకు
ఎంపికై న
క్రీడాకారులతో
జిల్లా చెస్
అసోసియేషన్
ప్రతినిధులు