
సార్వత్రిక సమ్మెలో మేము సైతం
వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
రాజమహేంద్రవరం రూరల్: దేఽశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన చేయబోయే సార్వత్రిక సమ్మెలో ఎల్‌ఐసీ క్లాస్–3, క్లాస్–4 ఉద్యోగులు 50వేలమంది భాగస్వామ్యం అవుతున్నారని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ రాజమహేంద్రవరం డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం.కోదండరామ్ తెలిపారు. సోమవారం మోరంపూడి ఎల్‌ఐసీ రాజమహేంద్రవరం డివిజనల్ కార్యాలయంలో భోజన విరామ సమయంలో సార్వత్రిక సమ్మెకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆయన, యూనియన్ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌జే మాథ్యూస్, నాయకులు ఆవిష్కరించారు. కోదండరామ్, మాథ్యూస్ మాట్లాడుతూ నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఎల్‌ఐసీలో అతి పెద్ద సంఘం అయిన ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ సమ్మెలో పాల్గొంటుందన్నారు. ఈ సమ్మెలో ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతూ పాల్గొంటున్నామన్నారు. బీమా పాలసీలపై జీఎస్‌టీ రద్దు చేయాలని, ఎల్‌ఐసీలో ఖాళీగా ఉన్న క్లాస్ 3, 4 ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని, నూతన పెన్షన్ పథకం రద్దు చేసి, ఎల్‌ఐసీలో ఉన్న ఉద్యోగులు అందరికీ 1995 పెన్షన్ పథకం అమలు చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను ఒకే కంపెనీగా చేయాలని, కనీస వేతనం రూ.26,000 అందరికీ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. మహిళా కన్వీనర్ శిరీష, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి సమ్మతం గనెయ్య, ఓబీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్, అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.