
రూ.10 కోట్ల విలువైన భూమిని కాపాడండి
● ఒకటో డివిజన్‌లో ఆక్రమిత స్థలాన్ని
స్వాధీనం చేసుకోవాలి
● కలెక్టర్‌కు మాజీ ఎంపీ భరత్
ఫిర్యాదు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కార్పొరేషన్ పరిధి లో లాలాచెరువు వద్దగల సాయిదుర్గానగర్‌లో దాదాపు రూ.10కోట్ల విలువైన 1,300 గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు మాఫియాగా ఏర్పడి కాజేస్తున్నందున ప్రభుత్వం దృష్టి సారించి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కి ఆయన ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 186–1, ఏరియాలో ప్లాట్లుగా విభజించిన సమీప డోర్ నంబర్ 72–16–1/2 వద్ద ప్లాటు నంబర్ 30లో 524 చదరపు గజాల ప్లాటు, నంబర్ 9లో 406 చదరపు గజాల ప్లాటు, నంబర్ 10లో 387 చదరపు గజాలు మొత్తం 1317 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించారని భరత్ విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. ఇది కార్పొరేషన్‌కి వదిలిన పార్కుకు సంబంధించిన స్థలం అని అయితే కొందరు వ్యక్తులు దీనికి సంబంధించిన దస్తావేజు నకళ్లను తీసి దానికి వారసులుగా విజయనగరం జిల్లా, గంట్యాడ మండలం, రామవరంలో ఓ మహిళకి గిఫ్ట్ వచ్చినట్లు నకిలీ డాక్యుమెంట్ పుట్టించి విజయనగరం జిల్లాలో రిజిస్టర్ చేయించారని ఆయన వివరించారు. కానీ ఈ నంబర్లు రాజమహేంద్రవరం రిజిస్టర్ ఆఫీసులో నమోదు కాలేదని, మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీ స్థలం పన్ను కూడా వేయించారని భరత్ పేర్కొన్నారు. పదికోట్ల రూపాయల విలువైన భూమిని కాజెయ్యడానికి మాఫీయా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయన కోరారు. పక్కాగా ఉన్న ఆధారాలన్నీ పూర్తిగా పరిశీలించి, ఈ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, మున్సిపల్ కార్పొరేషన్‌కి సంబంధించిన పార్కు సలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖాళీస్థలాలు, ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే చాలు భూ మాఫియా పేట్రేగిపోతోందని విమర్శించారు.