
పరీక్షలు ముగిశాయి.. ఫలితాలు మిగిలాయి
అమలాపురం టౌన్/రాయవరం: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈ నెల 1న ఫస్టియర్, 3న సెకండియర్ పరీక్షలు ప్రారంభమైన విషయం విదితమే. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించగా, శనివారం ఇంటర్ సెకండియర్ వాణిజ్య శాస్త్రం, రసాయ శాస్త్రం పరీక్షలతో మేజర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు 584 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ పరీక్షలకు జిల్లాలో ఏర్పాటు చేసిన 40 కేంద్రాల్లో మొత్తం 9,927 మందికి గాను 9,617 మంది పరీక్షలు రాశారు. 310 మంది హాజరు కాలేదు. అలాగే ఒకేషనల్ పరీక్షలకు మొత్తం 1,891 మంది హాజరు కావాల్సి ఉండగా, 1,617 మంది పరీక్షలు రాశారు. 274 మంది హాజరు కాలేదు. కొత్తపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిద్ధార్థ జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి వనుము సోమశేఖరరావు తనిఖీలు చేశారు. ఇదిలా ఉండగా, సోమ, మంగళవారాల్లో 11 కేంద్రాల్లో బ్రిడ్జి కోర్సు పరీక్షలు నిర్వహిస్తారు. 19, 20 తేదీల్లో ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాగ్రఫీ పరీక్ష నిర్వహిస్తారు. 20వ తేదీతో పరీక్షలు పూర్తి స్థాయిలో ముగుస్తాయి. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగియడానికి ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పని చేశారని ఇంటర్మీడియెట్ సోమశేఖరరావు తెలిపారు. ఫస్టియర్ 13,431 మంది, సెకండియర్ 13,881 మంది కలిపి మొత్తం 27,312 మంది పరీక్షలు రాశారు. ప్రధాన పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులంతా ఆనందంగా ఇంటి బాట పట్టారు.
కొనసాగుతున్న మూల్యాంకనం
ఈ నెల 7 నుంచి జిల్లా కేంద్రమైన అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మూల్యాంకనం ప్రారంభమైంది. సంస్కృతం పేపరుతో మూల్యాంకనం ప్రారంభం కాగా, ఈ నెల 17 నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, పౌరశాస్త్రం సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభం కానున్నదని సోమశేఖరరావు తెలిపారు.