
దినకర తేజ... ధరణీనాయక
ఫ దారులన్నీ వాడపల్లి క్షేత్రానికే..
ఫ ఒకేరోజు రూ.44.31 లక్షల ఆదాయం
కొత్తపేట: దినకర తేజా గోవింద.. ధరణీనాయక గోవింద అంటూ ఆ స్వామిని కీర్తిస్తూ భక్తజనం మురిసింది.. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక చింతనతో బాసిల్లింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే వాడపల్లి బాట పట్టారు. పావన గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, క్యూ లైన్లలో బారులు తీరి మరీ స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. తలనీలాలు సమర్పించారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. అర్చకులు సుప్రభాత సేవతో ప్రారంభించి వివిధ సేవలు నిర్వహించారు. రంగురంగుల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. స్వామి దర్శనం, తీర్థప్రసాదాల స్వీకరణ అనంతరం అన్నసమారాధనలో వేలాది మంది అన్న ప్రసాదం స్వీకరించారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూ టీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఇతర అధికారులు, సిబ్బంది భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఈ ఒక్కరోజు దేవస్థానానికి సాయంత్రం 4 గంటల వరకూ రూ 44.31 లక్షల ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్‌ఐ ఎస్.రాము, వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రించి, బందోబస్తు పర్యవేక్షించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి వాడపల్లికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది.

దినకర తేజ... ధరణీనాయక