యువికా.. ప్రతిభకు వేదిక | - | Sakshi
Sakshi News home page

యువికా.. ప్రతిభకు వేదిక

Mar 2 2025 12:04 AM | Updated on Mar 2 2025 12:04 AM

యువికా.. ప్రతిభకు వేదిక

యువికా.. ప్రతిభకు వేదిక

ఇస్రో ఆధ్వర్యంలో

యువ విజ్ఞాన కార్యక్రమం

9వ తరగతి విద్యార్థులకు

చక్కని అవకాశం

మార్చి 23 వరకూ దరఖాస్తులకు గడువు

రాయవరం: అంతరిక్ష విజ్ఞానం, స్పేస్‌ అప్లికేషన్స్‌పై అవగాహన కల్పించేందుకు యువికా–2025 (యంగ్‌ సైంటిస్ట్‌) కార్యక్రమాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించింది. అంతరిక్షంలో ఎలా ఉంటుంది.. ఉపగ్రహాల ప్రయోగం ఎలా చేస్తారు.. ఇలాంటి అంశాలపై శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తుంది. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 9వ తరగతి విద్యార్థులకు చక్కని తోడ్పాటు అందిస్తుంది. యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) పేరుతో అర్హులకు ఈ శిక్షణ ఇవ్వనుంది.

ప్రతిభావంతులకు..

విద్యార్థి దశ నుంచే సైన్స్‌పై ఆసక్తి చూపి ఎందరో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. అటువంటి విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెరుస్తున్నారు. వారి కోసం ఇస్రో ప్రత్యేకంగా యువ విజ్ఞాన కార్యక్రమాన్ని ‘యువికా’ పేరుతో నిర్వహిస్తోంది. 2024–25 విద్యా సంవత్సరంలో ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇస్రో.జీవోవీ.ఇన్‌లో ఈ నెల 24 నుంచి మార్చి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. వచ్చిన దరఖాస్తుల నుంచి ఏప్రిల్‌ 7న మొదటి విడత ఎంపిక జాబితా విడుదల చేస్తారు.

అర్హతలివీ..

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు యువికా–2025 దరఖాస్తుకు అర్హులు. 8వ తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం 2024–25 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే దరఖాస్తుకు అవకాశముంది. విద్యార్థి విద్యాభ్యాస కాలంలో చూపించిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాష్ట్ర సిలబస్‌, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.

ఎంపిక పద్ధతి

8వ తరగతిలో పొందిన మార్కులు (50 శాతం), మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర/జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటే (2/5/10 శాతం), ఆన్‌లైన్‌ క్విజ్‌లో ప్రతిభకు (10 శాతం), ఒలింపియాడ్‌లో పాల్గొని పాఠశాల/ జిల్లా/ రాష్ట్ర స్థాయిల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి (2/ 4/ 5శాతం), రిజిస్టర్డ్‌ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన వారికి (2/ 4/ 5శాతం), మూడేళ్లలో స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రతిభ చూపిన వారికి (5 శాతం), గ్రామీణ ప్రాంతంలో చదువుతున్న వారికి (15 శాతం) మార్కులు ఇస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికై న వారికి మే 18వ తేదీ నుంచి 30 వరకు ఆయా కేంద్రాల్లో పూర్తిగా రెసిడెన్షియల్‌ పద్ధతిలో శిక్షణ ఇస్తారు. ఎంపికై న విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్‌ టీచర్‌కు కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలను వివరిస్తారు.

ఏడు శిక్షణ కేంద్రాల్లో..

విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏడు కేంద్రాలను ఎంపిక చేశారు. తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్‌, బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌, అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌, హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌, షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్ట్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌, ఐఐఆర్‌ఎస్‌, డెహ్రాడూన్‌, సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోటలో ఎంపికై న విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.

దరఖాస్తు విధానం

నాలుగు దశల్లో విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటగా ఈ–మెయిల్‌ ఐడీతో వివరాలు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ క్విజ్‌లో పాల్గొనాలి. క్విజ్‌ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమ ర్పించాలి. మూడేళ్లలో వివిధ అంశాల్లో విద్యార్థి సా ధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ ప త్రాలు ఏవైనా ఉంటే, వాటి జెరాక్స్‌ కాపీలపై విద్యార్థి సంతకం చేసి అప్‌లోడ్‌ చేయాలి. దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 23వ తేదీ వరకూ అవకాశముంది. ఎంపిక జాబితాను రెండు విడతల్లో ప్రకటించి అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. యువికా శిక్షణకు ఎంపికై న వారికి శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వ సతితో పాటు అన్ని సౌకర్యాలను ఇస్రో కల్పిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement