
సాక్షి అమలాపురం: ‘రాజకీయాలలో శాశ్వత మిత్రుడు... శాశ్వత శత్రువు‘ అంటూ ఉండరంటారు. ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం రాజకీయాలు చేయడం సహజమే అయినా... మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు మాత్రం మిత్ర ధర్మాన్ని పాటిస్తారు. కానీ ఈ విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరే వేరు. తన నీడన సైతం నమ్మని బాబు మిత్రపక్షాలను సైతం అనుమానిస్తూ... అడుగడుగునా అవమానిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటారు. బాబు బాటలోనే తమ్ముళ్లు కూడా నడుస్తున్నారు. పొత్తు ధర్మానికి తిలోదకాలు ఇస్తున్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీట్ల పంపకం తేలకున్నా... మిత్రపక్షాన్ని సంప్రదించకుండా టీడీపీ ఇన్‌చార్జులు, పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నవారు ప్రచారం ప్రారంభించడంపై మిత్రపక్షమైన జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
గత ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచిన ఏకై క నియోజకవర్గం కోనసీమలోని రాజోలు. దీంతోపాటు పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో 30 వేలకు పైబడి ఓట్లు వచ్చాయి. వీటిలో అమలాపురంలో అయితే సుమారు 45 వేల వరకు ఓట్లు సాధించింది. ఈ కారణంగా పొత్తులలో ఈ జిల్లా నుంచి తమకు అధిక సీట్లు కావాలని జనసేన కేడర్ పట్టుబడుతోంది. ముఖ్యంగా అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ తమ జనసేనకు ఆత్మ గౌరవంగా చెబుతోంది. ఈ విషయంలో టీడీపీ సీట్లు త్యాగం చేసి సహకరించాలని కోరుతోంది. కాని టీడీపీ నాయకత్వం పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఏడు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గంలో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే జనసేనకు ఇస్తామని టీడీపీ సంకేతాలు ఇస్తోంది.
ప్రచారం మొదలు పెట్టిన ఆనందరావు
టీడీపీ, జనసేన పొత్తు అనుకున్న దగ్గర నుంచి అమలాపురంలో రెండు పార్టీలో కీలక నేతల మధ్య ఉప్పునిప్పుగా మారింది. జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు ఒకప్పుడు టీడీపీ నాయకత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చినవారే. ఇప్పుడు టీడీపీకి సీటు కేటాయిస్తే మరోసారి తాము వారి కాళ్ల వద్ద పనిచేయాలని వాపోతున్నారు. గతంలో రెండు పార్టీలు నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశాలకు, పార్టీ కార్యక్రమాలకు కీలక జనసేన నేతలు దూరంగా ఉన్నారు. అమలాపురం నుంచి జనసేనను పోటీలో ఉంచాలని కోరగా అధినేత అంగీకరించారని, సీటు తమకే వస్తుందని ఇటీవల పవన్‌ను కలిసిన జనసేన నాయకులు చెప్పుకొచ్చారు.
కాని వారం తిరగకుండానే టీడీపీ ఇన్‌చార్జి ఆనందరావు ఏకంగా ఎన్నికల ప్రచార రథాన్ని తయారు చేయించడం, రథసప్తమి మంచిదని ప్రచారం చేయడం జనసేన నాయకులకు మింగుడు పడడం లేదు. ఇంకా సీట్ల సర్దుబాటు కాకుండానే ఎన్నికల ప్రచారం చేయడం పొత్తు ధర్మానికి విరుద్ధమని వారు వాపోతున్నారు. ఆనందరావు చేపట్టిన ప్రచారంపై సొంత పార్టీ టీడీపీలో సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీటు తేల్చకుండా ప్రచారం చేయడం వల్ల మిత్రపక్షం జనసేన క్యాడర్‌ను రెచ్చగొట్టడమేనని వారంటున్నారు.
మిగిలిన చోట్లా అదే వరస
జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావును గెలిపించాల్సిందిగా చంద్రబాబు మండపేట సభలో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాజోలు నుంచి తాము పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మిగిలిన ఐదు అసెంబ్లీలకు పొత్తు ఖరారు కాలేదు. పి.గన్నవరానికి టీడీపీ ఇన్‌చార్జి లేరు. అమలాపురంతోపాటు కొత్తపేట, ముమ్మిడివరాలలో టీడీపీ ఇన్‌చార్జిలు బండారు సత్యానందరావు, దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు)లు తామే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటుండం గమనార్హం. ‘‘బాబు ష్యూరిటీ... భవిష్యత్ గ్యారెంటీ’’ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమను ఆశీర్వదించాలని కోరుతున్నారు. టీడీపీ ఇన్‌చార్జిలు నిర్వహిస్తున్న ఈ ప్రచార విషయాన్ని పార్టీ పెద్దలు దృష్టికి తీసుకుని వెళుతున్నా ఫలితం లేకుండా పోయిందని జనసేన పార్టీ ఇన్‌చార్జిలు, నాయకులు వాపోతున్నారు.