చట్టానికి దొరక్కుండా... ఆన్‌లైన్‌ గేమింగ్‌ | Sakshi
Sakshi News home page

చట్టానికి దొరక్కుండా... ఆన్‌లైన్‌ గేమింగ్‌

Published Mon, Sep 12 2022 9:05 AM

Chinese Doing Business Outside The Law In Online Gaming Matters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కలర్‌ ప్రిడెక్షన్‌ గేమ్‌.. లోన్‌ యాప్స్‌.. నిర్వహణలో ఉన్న లోపాల కారణంగానే విషయం పోలీసు కేసుల వరకు వెళ్లిందని చైనీయులు భావిస్తున్నారా? అంటే అవుననే జవాబు చెబుతున్నారు సైబర్‌ క్రైమ్‌ అధికారులు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ విషయంలో చట్టానికి దొరక్కుండా వ్యవహారాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో అందుబాటులోకి వస్తున్న ఆన్‌లైన్‌ గేమ్స్‌లో అత్యధికం చైనీయులకు సంబంధించినవే అని స్పష్టం చేస్తున్నారు. తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ గేమింగ్‌ యాప్స్‌పై చర్యలకు అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు.  

గెలిపిస్తూ బానిసలుగా మార్చి.. 
ఎదుటి వ్యక్తికి తమ గేమ్‌కు బానిసలుగా మార్చడానికి గేమింగ్‌ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్‌ను ప్రమోట్‌ చేస్తున్నాయి. వీటికి ఆకర్షితులవుతున్న వాళ్లు (ప్రధానంగా యువత) వాటిని ఇన్‌స్టాల్‌ చేసుకుని ఆడటం మొదలెడుతున్నారు. ఈ గేమ్స్‌ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్‌ ద్వారా నడుస్తుంటాయి. దాని ప్రకారం గేమ్‌ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్‌ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు.  

మొదట వాటిని ఫ్రీగా ఇచ్చి.. 
ఇలా తమ గేమ్‌కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్‌లో ఓడిపోయేలా చేస్తారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన వారిలో కలిగిస్తారు. దీనికోసం టిప్స్‌ ఇస్తున్నామంటూ కొన్ని యూసీ పాయింట్లను ఉచితంగా ఇస్తారు. ఆడే వ్యక్తి వీటికి అలవాటుపడిన తర్వాత యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ సందేశాలు పంపిస్తారు. వాటికి అవసరమైన రుసుం డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులతో చెల్లించాలని షరతు పెడతారు. అప్పటికే ఈ గేమ్స్‌కు బానిసలుగా మారుతున్న వాళ్లు తప్పనిసరై డబ్బు చెల్లించి ముందుకు వెళ్తున్నారు.  

ఆ గేమ్‌ ఉచితం కావడంతో... 
ఇలా భారీ మొత్తాలు కోల్పోయిన అనేక మంది బాధితులు, వారి తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయిస్తున్నారు. వీరి ఫిర్యాదులతో కేసులు నమోదు చేస్తున్నప్పటికీ చర్యలకు మాత్రం ఆస్కారం ఉండట్లేదు. గేమ్‌ ఆడటానికి డబ్బు వసూలు చేస్తే ఆ కంపెనీపై చర్యలు తీసుకోవచ్చు. అందుకే గేమ్‌ను ఉచితంగా అందిస్తున్న చైనా కంపెనీలు యూసీ పాయింట్ల పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. ఆ గేమ్‌ ప్రారంభంలో ఎక్కడా ఈ చెల్లంపుల విషయం ఉండదు.  ఈ నేపథ్యంలోనే కొన్ని గేమింగ్‌ యాప్స్‌పై గేమింగ్‌ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉండట్లేదు. 

జీపీఎస్‌ మార్చడంతో ఇబ్బంది 
ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఆన్‌లైన్‌ గేమింగ్‌కు రాష్ట్రంలో అనుమతి లేదు. ఇక్కడ ఎవరైనా ఆ యాప్‌ను ఓపెన్‌ చేస్తే.. జీపీఎస్‌ ఆధారంగా విషయం గుర్తించే నిర్వాహకులు గేమ్‌కు అక్కడ అనుమతి లేదంటూ స్క్రీన్‌పై సందేశం కనిపించేలా చేస్తారు. దీంతో వీటికి బానిసలుగా మారిన అనేక మంది ఫేజ్‌ జీపీఎస్‌ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. 
– కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ  

(చదవండి: నష్టాలకు సాకు... బస్సులకు బ్రేక్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement