
మధురం..విఫలం
● ధరలు పతనంతో రైతులు విలవిల
● తోతాపురి కొనుగోలుకు ఆసక్తి చూపని జ్యూస్‌ఫ్యాక్టరీ యజమానులు
బంగారుపాళెం: మండలంలో మామిడి రైతులు విలవిల్లాడుతున్నారు. 70 శాతం మంది ఉద్యాన పంటైన మామిడి సాగుపై జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి బాగానే వచ్చినా ధరలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో దిగాలు చెందుతున్నారు. జిల్లాలో బంగారుపాళెం మార్కెట్ మామిడి ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉంది.
తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి మామిడి కాయలు కొనుగోలు చేసి ఎగుమతి చేసేవారు. అదేవిధంగా గుజ్జు పరిశ్రమలకు చెందిన యజమానులు మామిడి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం వ్యాపారులు లేక మార్కెట్ వెలవెలబోతోంది.
తోతాపురి అమ్మడు పోయేనా?
రైతులు అత్యధికంగా తోతాపురి(బెంగళూర) మామిడిని సాగుచేస్తున్నారు. ఈ సారి పంట దిగుబడి బాగానే వచ్చినప్పటికీ ధర ఆశించిన స్థాయిలో లేదు. ప్రస్తుతం కిలో రూ.8 నుంచి రూ.9 వరకు పలుకుతోంది. తోతాపురికి కనీస గిట్టుబాటు ధర టన్నుకు రూ.25 వేలు ఇవ్వాలని రైతులు, రైతు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దీంతో ప్రభుత్వం టన్ను రూ.12 వేలు నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరను అములు చేయాలని కలెక్టర్ జూస్ ఫ్యాక్టరీ యజమానులను ఆదేశించారు. బెంగళూర రకం మామిడి కొలుగోలు చేసేందుకు జూస్ ఫ్యాక్టరీ యజమానులు ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. తమిళనాడు, కర్ణాటక నుంచి తక్కువ ధరకే ఫ్యాక్టరీలకు రవాణా చేస్తుండడంతో ధర ఎక్కువ పెట్టి కొలుగోలు చేసేందుకు ఇష్టపడడం లేదు. గతంతో మార్కెట్ ప్రారంభంలో తోతాపురి (బెంగళూర)రకం ఆశాజనకంగా ఉండేదని, టన్ను రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు పలికేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూర రకం మామిడికి ధర ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే రైతులు ఇప్పటి వరకు తోతాపురి కాయలు కొతలు మొదలు పెట్ట లేదు.
ఈ ఏడాది తగ్గిన మామిడి ధరలు
రకం టన్ను ధర
బెన్నీషా రూ.10 వేల నుంచి
రూ.35 వేల వరకు
కాలేపాడు రూ.20 వేల నుంచి
రూ.40 వేల వరకు
మల్లిక రూ.15 వేల నుంచి
రూ.40 వేల వరకు
ఖాదర్ రూ.23 వేల నుంచి
రూ.18 వేల వరకు తగ్గించేశారు
పులేరా రూ.12 నుంచి
రూ.6కు పడిపోయింది
నాటీ రకాలు కిలో రూ.4 లెక్కన
విక్రయిస్తున్నారు
గతంలో మామిడి ధరలు
రకం టన్ను ధర
బెన్నీషా రూ.80 వేలు నుంచి రూ.లక్ష
కాలేపాడు రూ.60 వేల నుంచి రూ.70
ఇమామ్ పసంద్ రూ.1.2 లక్షల నుంచి
రూ.1.5 లక్షల వరకు
మల్‌గూబ రూ.లక్ష వరకు
నాటీ రకాలు రూ.13 వేల నుంచి
రూ.15 వేల వరకు

మధురం..విఫలం