
దర్జాగా ప్రభుత్వ భూమి ఆక్రమణ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అధికారం అండతో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. విలువైన ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసినా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. చంద్రగిరి పట్టణంలో విలువైన ప్రభుత్వ భూమిని ఓ మైనార్టీ నేత అక్రమించుకుని గుట్టు చప్పుడు కాకుండా షెడ్డు నిర్మించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంద్రగిరి లెక్కదాఖలా సర్వే నంబరు 61/3లో కొంత మేర గ్రామకంఠం భూమి ఉంది. ఆ భూమిలో కొన్నేళ్లుగా ముస్లింలు పీర్ల పండుగను నిర్వహించుకుంటున్నారు. మిగిలిన సందర్భంగా భూమి ఖాళీగా ఉంది. ప్రస్తుతం దాని విలువ రూ.50 లక్షలకు పైగా ఉంది. దీనిపై అధికార పార్టీకి చెందిన ఓ మైనార్టీ నేత కన్ను పడింది. ఇటీవల వరుస సెలవులు రావడంతో శరవేగంగా అక్రమంగా షెడ్డును నిర్మించాడు. తరతరాలుగా పీర్లచావిడిగా వినియోగించుకుటున్న భూమిని ఆక్రమించుకోవడంపై ముస్లిం పెద్దలు మండిపడుతున్నారు. 2022లో కూడా ఈ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి అతను యత్నించాడని, అప్పట్లో రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారని పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అతను ఆక్రమించుకున్నాడని వాపోతున్నారు.
తహసీల్దార్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే ఆక్రమణ
తహసీల్దార్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఈ ఆక్రమణ జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ముస్లింలు, స్థానికులు మండిపడుతున్నారు. అక్రమంగా షెడ్డు నిర్మిస్తున్నట్టు రెండు వారాల క్రితం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎం, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెబుతున్నారు. దీనిపై వీఆర్‌వో పురుషోత్తంను వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.