
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ దర్శనార్థం ఆదివారం తిరుపతి నుంచి వచ్చిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. అమ్మవారి దర్శనంకోసం నడచి వెళుతుంగా ఫణి(10) అనే బాలుడిపై వీధి కుక్కలు దాడిచేశాయి. దీంతో చిన్నారి తొడభాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. ఆందోళన చెందిన కుటుంబీకులు వెంటనే బోయకొండ గంగాపురంలోని పీహెచ్‌సీకి వెళ్లారు అక్కడ వైద్యం చేసేందుకు ఎవరూ లేరు. దీంతో గంగమ్మ ఆలయ పరిపాలన కార్యాలయానికి చేరుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫలితం లేకపోవడంతో బాలుడిని హుటాహుటిన చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించాల్సి వచ్చింది. నిత్యం వేలాది మంది విచ్చేసే బోయకొండ ఆలయం వద్ద కనీసం ప్రాథమిక చికిత్సకు అవసరమైన మందులు కూడా లేకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. అలాగే పెద్దసంఖ్యలో హల్‌చల్ చేస్తున్న వీధి కుక్కలను నియంత్రించాల్సిన అవసరముందని కోరుతున్నారు.