ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ దిద్దుబాటు (కరెక్షన్) కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ ముగింపు తేదీ, మార్చి వాహన విక్రయాలు గణాంకాలు, కీలక ఆర్థిక గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. ఇక అంతర్జాతీయంగా ఉక్రెయిన్–రష్యాల మధ్య కొనసాగుతున్న యుద్ధం, నిరంతర పెరుగుతున్న ముడిచమురు ధరలు సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్‌పైనా మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి.
‘‘గత కొన్ని ట్రేడింగ్ సెషన్ల నిఫ్టీ 17,000–17,450 పాయింట్ల రేంజ్‌లో కదలాడుతోంది. ఈ శ్రేణిని చేధిస్తేనే తదుపరి స్థాయిలను అంచనా వేయవచ్చు’’ అని నిపుణులు చెబుతున్నారు. ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో గతవారంలో సెన్సెక్స్ 502 పాయింట్లు, నిఫ్టీ 134 పాయింట్లను నష్టాలను చవిచూశాయి. దీంతో సూచీల రెండువారాల వరుస లాభాలకు బ్రేక్ పడింది.
ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు....
రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు
నెలరోజులుగా కొనసాగుతున్న ఉక్రెయిన్, రష్యాల యుద్ధం ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. శాంతి చర్చలు క్లిష్టం గా సాగుతున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. జీ–20 కూటమి నుండి రష్యాను బహిష్కరించేందుకు ఆయా దేశాలతో చర్చలు జరుపుతామని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. కాల్పుల విరమణ చర్చల సఫలవంతం కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
కీలకంగా ఆర్థిక, ఆటో అమ్మక గణాంకాలు
కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఫిబ్రవరి ద్రవ్యలోటు(ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాల మధ్య బేధం) గణాంకాలను గురువారం విడుదల చేయనుంది. అదేరోజున మౌలిక రంగాల వృద్ధిగా పిలిచే ఎనిమిది రంగాల ఉత్పత్తి(ఫిబ్రవరి)డేటా వెల్లడి అవుతుంది. దేశీయ ఆటో కంపెనీలు శుక్రవారం మార్చి నెలతో గతేడాది పాటు 2021 ఆర్థిక సంవత్సరపు వాహన అమ్మక గణాంకాల వివరాలను వెల్లడించనున్నాయి. ఈ కీలకమైన ఈ గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది.
గురువారం ఎఫ్‌అండ్‌ఓ ముగింపు
ఈ గురువారం(మార్చి 31న) నిఫ్టీ సూచీకి చెందిన మార్చి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ పరిణామాలు
ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. అంతర్జాతీయంగా కోవిడ్ కేసులు తిరిగి పెరుగుతున్నాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో సప్లై అవాంతరాలు ఆటంకం కలుగవచ్చనే అంచనాల నడుమ ఇప్పటికే క్రూడాయిల్ ధర భారీ పెరిగాయి. చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వినియోగ విశ్వాస, నిరుద్యోగ, చమురు నిల్వల డేటాతో పాటు కీలకమైన క్యూ4 జీడీపీ గణాంకాలు ఈ వారంలో విడుదల అవుతాయి. జపాన్ నిరుద్యోగ గణాంకాలు మంగవారం, యూరోజోన్ పారిశ్రామిక డేటా బుధవారం వెల్లడికానున్నాయి. వీటితో పాటు ఆయా దేశాలు విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాల ఆధారంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కదలాడవచ్చు.
మూడు నెలల్లో రూ.లక్ష కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి..
భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలతో భారత మూలధన మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు గడిచిన మూడునెలల్లో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఎఫ్‌ఐఐలు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరుసగా రూ.28,526 కోట్లు, రూ.38,068 కోట్లు, రూ.48,261 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాం కాలు వెల్లడించాయి. ‘‘ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతులు తక్కువగా ఉంటడంతో యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పరిమితంగానే ఉంది.
అయితే అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఇంధన, మెటల్స్, వ్యవసాయ తదితర కమోడిటీ ఉత్పత్తుల ధరలు దేశీయ కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తాయి’’ కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ సుబానీ కురియన్ తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పదిశాతం పెరిగితే దేశీయ కరెంట్ అకౌంట్ ద్రవ్యలోటు 30 బేసిస్ పాయింట్ల, సీపీఐ ద్రవ్యోల్బణం 40 బేసిస్ పాయింట్లు మేర పెరగవచ్చని కురియన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment