ఆల్టిగ్రీన్‌లో రిలయన్స్‌కు వాటాలు

RIL subsidiary to invest Rs 50 cr in Altigreen Propulsion Labs - Sakshi

రూ. 50 కోట్లు డీల్‌

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల టెక్నాలజీ, సొల్యూషన్స్‌ కంపెనీ ఆల్టిగ్రీన్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్స్‌లో వాటాలు కొనుగోలు చేసినట్లు పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) వెల్లడించింది. అనుబంధ సంస్థ రిలయన్స్‌ న్యూ ఎనర్జీ (ఆర్‌ఎన్‌ఈఎల్‌) ద్వారా కుదుర్చుకున్న ఈ డీల్‌ కోసం రూ. 50.16 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. ఆల్టిగ్రీన్‌లో రూ. 100 ముఖవిలువ గల 34,000 సిరీస్‌–ఎ కంపల్సరీ కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆర్‌ఎన్‌ఈఎల్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్‌ తెలిపింది.

అయితే, ఈ పెట్టుబడులకు ప్రతిగా ఆల్టిగ్రీన్‌లో ఎంత వాటా లభిస్తుందన్నది మాత్రం వెల్లడించలేదు. 2013లో ఏర్పాటైన ఆల్టిగ్రీన్‌.. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. 2020–21లో కంపెనీ రూ. 1.03 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. వాణిజ్య రవాణాకు సంబంధించి 2/3/4 వీలర్ల ఎలక్ట్రిక్‌ వాహనాల టెక్నాలజీ, సొల్యూషన్స్‌ అందిస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ప్లాట్‌ఫాంపై సొంతంగా ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాన్ని తయారు చేసింది. ఎలక్ట్రిక్‌ మోటర్లు, వాహనాల కంట్రోల్స్, బ్యాటరీ నిర్వహణ మొదలైన టెక్నాలజీలు కంపెనీ వద్ద ఉన్నాయి.

స్టెర్లింగ్‌లో వాటాల కొనుగోలు పూర్తి..
షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ (ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎల్‌)లో 40 శాతం వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. గతేడాది నుంచి విడతలవారీగా జరిగిన ఈ డీల్‌ కోసం రూ. 2,845 కోట్లు వెచ్చించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top