స్టార్‌లింక్ వివాదం.. తొలిసారి స్పందించిన రిలయన్స్! | Reliance Responds To Elon Musk Remarks On Starlink India Entry, Says It Has Never Feared Competition, Check Post Inside | Sakshi
Sakshi News home page

స్టార్‌లింక్ వివాదం.. తొలిసారి స్పందించిన రిలయన్స్!

Oct 16 2026 10:26 AM | Updated on Oct 16 2026 11:28 AM

Reliance Reacts To Elon Musk Remarks On Starlink India Entry

భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభంపై.. ఎలాన్ మస్క్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. స్టార్‌లింక్‌కు అనుమతులు రావడంలో ఎదురవుతున్న సమస్యలపై మస్క్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా రిలయన్స్ స్పందించింది. తాము పోటీకి ఎప్పుడూ భయపడలేదని, భారత్‌లో వ్యాపారం చేయాలనుకునే ప్రతి కంపెనీ ఇక్కడి చట్టాలు, నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

పోటీకి మేం భయపడలేదు!
స్టార్‌లింక్ విషయంలో జరుగుతున్న పరిణామాలపై రిలయన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో స్వదేశీ కంపెనీలైనా, విదేశీ సంస్థలైనా ప్రభుత్వం అందరికీ ఒకే విధమైన విధానాన్ని అనుసరిస్తోందని తెలిపింది. తమ జియో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు కూడా ఇంకా అనుమతులు రావాల్సి ఉందని పేర్కొంది.

భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి, కొత్త టెక్నాలజీని తీసుకురావడానికి అన్ని సంస్థలకు అవకాశాలు ఉన్నాయని రిలయన్స్ తెలిపింది. అయితే, వ్యాపారం చేసే ప్రతి కంపెనీ దేశ చట్టాలను గౌరవించాలని స్పష్టం చేసింది. శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోకి స్టార్‌లింక్ రావడాన్ని కూడా స్వాగతిస్తున్నామని పేర్కొంది.

జియో ప్రయాణం..
పోటీకి తాము ఎందుకు భయపడబోమో చెప్పడానికి రిలయన్స్ తన జియో ప్రయాణాన్ని ఉదాహరణగా చూపించింది. 2016లో టెలికాం రంగంలోకి అడుగుపెట్టినప్పుడు జియోకు ఒక్క కస్టమర్ కూడా లేడని గుర్తుచేసింది. అప్పటికే మార్కెట్‌లో అనేక కంపెనీలు ఉన్నప్పటికీ, తక్కువ ధరలకు డేటా అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందామని వెల్లడించింది.

ప్రస్తుతం జియోకు 53 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారని కంపెనీ పేర్కొంది. వినియోగదారులకు ఎవరు మెరుగైన సేవలు అందిస్తారనేదే పోటీలో ముఖ్యమని రిలయన్స్ స్పష్టం చేసింది. ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోనూ ఇదే విధంగా పోటీని స్వాగతిస్తున్నామని వెల్లడించింది.

అసలు వివాదం
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ స్టార్‌లింక్ ద్వారా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. సాధారణ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ అందించడం దీని ప్రత్యేకత. భారత్‌లో ఈ సేవలను ప్రారంభించేందుకు స్టార్‌లింక్ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.

అయితే.. అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు విషయంలో ఆలస్యం జరుగుతోందంటూ అక్టోబర్ 7న మస్క్ విమర్శలు చేశారు. కొంతమంది వ్యాపారవేత్తలు స్టార్‌లింక్‌కు అడ్డుపడుతున్నారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు.

దీనిపై మరుసటి రోజు భారత కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ స్పందించింది. వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది. శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో అనుమతుల ప్రక్రియ న్యాయంగా కొనసాగుతోందని, సంబంధిత మూడు సంస్థల భద్రతా పరిశీలన కూడా జరుగుతోందని వివరించింది.

అంబానీని ఉద్దేశించిన మస్క్
ప్రభుత్వ వివరణ వచ్చిన కొన్ని గంటల తర్వాత మస్క్ మరోసారి స్పందించారు. స్టార్‌లింక్ 165కు పైగా దేశాల్లో పనిచేస్తోందని, భారత్‌లో నిబంధనలను పాటించేందుకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అయినా.. భారత్‌లో అనుమతి ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తూ, ''భారత్‌కు అసలైన బాస్ అంబానీనా?'' అని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: అమెరికా గ్రీన్ కార్డుల వివాదం.. బ్రాడ్ స్మిత్ హెచ్చరిక!

వినియోగదారులకు ఏమిటి లాభం!
స్టార్‌లింక్ భారత్‌లో సేవలు ప్రారంభిస్తే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రదేశాల్లో ఇంటర్నెట్ సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది. మరోవైపు, జియో కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ రెండు సంస్థల మధ్య భవిష్యత్తులో పోటీ పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇంటర్నెట్ ధరలు, సేవల నాణ్యత, కనెక్టివిటీ విషయంలో వినియోగదారులకు ప్రయోజనం కలగవచ్చు. అయితే.. స్టార్‌లింక్ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, వాటి ధరలు ఎంత ఉంటాయనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement