
మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని విదేశీ పెట్టుబడుల (విదేశీ స్టాక్స్, ఇతర సెక్యూరిటీల్లో) విలువ గత ఆర్థిక సంవత్సంలో 5.6 శాతం తగ్గి 8.3 బిలియన్ డాలర్లుగా (రూ.72,210 కోట్లు సుమారు) ఉన్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. 2024 మార్చి నాటికి మ్యూచువల్ ఫండ్స్ విదేశీ నిర్వహణ ఆస్తుల విలువ 8.81 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం చివరికి ఫండ్స్ నిర్వహణలోని యూఎస్ ఈక్విటీల విలువ 3.9 శాతం తగ్గి రూ.44,500 కోట్లుగా ఉన్నట్టు ఆర్‌బీఐ వార్షిక సర్వే నివేదిక తెలిపింది.
ఐర్లాండ్, తైవాన్‌లోని పెట్టుబడుల విలువ సైతం ఇదే మాదిరి తగ్గింది. భారత మ్యూచువల్ ఫండ్స్ సంస్థల విదేశీ పెట్టుబడుల్లో 95 శాతం యూఎస్, లగ్జెంబర్గ్, ఐర్లాండ్‌లోనే ఉన్నట్టు ఆర్‌బీఐ డేటా తెలియజేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన వాణిజ్య విధానాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు నెలకొనడం తెలిసిందే. ఇక గత ఆర్థిక సంవత్సరంలో దేశీ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ పథకాల్లోని పెట్టుబడులు 25 శాతం పెరిగి రూ.29.45 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెబుతూ.. స్థానిక మార్కెట్‌పై ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగినట్టు వివరించింది.
ఇదీ చదవండి: పీఎస్‌యూ బ్యాంక్ చీఫ్‌లతో ఆర్థిక శాఖ సమావేశం
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ విదేశీ చెల్లింపుల బాధ్యతలు 20 శాతం పెరిగి 30.5 బిలియన్ డాలర్లకు చేరాయని.. ప్రవాస భారతీయుల పెట్టుబడులు పెరగడం వల్లేనని వివరించింది. భారత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో యూఏఈలోని ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులు రూ.52,549 కోట్లకు చేరాయి. ఫండ్స్ ఆస్తుల్లో యూఏఈ, యూఎస్‌ఏ, యూకే, సింగపూర్ ఎన్‌ఆర్‌ఐల వాటా అధికంగా ఉంది.