గూగుల్‌ సంచలన యాప్‌.. ఇంటర్నెట్‌ లేకుండా ఏఐ.. | Google launches app to let anyone run AI models on their phone without internet | Sakshi
Sakshi News home page

గూగుల్‌ సంచలన యాప్‌.. ఇంటర్నెట్‌ లేకుండా ఏఐ..

Jun 2 2025 12:16 PM | Updated on Jun 2 2025 12:28 PM

Google launches app to let anyone run AI models on their phone without internet

విస్తృతమైన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌.. స్మార్ట్‌ ఫోన్‌లలో ఏఐ వినియోగాన్ని భిన్నంగా మార్చే ఓ సంచలన యాప్‌ను తీసుకొచ్చింది. దీని పేరు ‘ఏఐ ఎడ్జ్‌ గ్యాలరీ’. ఈ యాప్‌ ద్వారా శక్తిమంతమైన ఏఐ మోడల్స్‌ను మొబైల్స్‌లో  ఆఫ్‌లైన్‌లోనే రన్‌ చేయొచ్చు. అంటే ఎటువంటి ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే ఏఐతో ఇమేజ్‌లను సృష్టించడం, కోడ్‌ రాయడం, సమాధానాలు రాబట్టడం వంటివి చేయొచ్చన్న మాట.

ఇందులో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. యూజర్‌ ‍ప్రైవసీకి ముప్పు చాలా తక్కువ. ఎందుకంటే యూజర్లు అందించే డేటా క్లౌడ్‌ సర్వర్లకు వెళ్లకుండా మొత్తం ఫోన్‌లోనే రన్‌ అవుతుంది. ఇది సెక్యూరిటీ ముప్పును తగ్గిస్తుంది. అలాగే పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుంది. సర్వర్‌ కోసం వేచిచూసే పనిలేకుండా యూజర్ల అడిగే ప్రశ్నలకు నేరుగా స్పందించేందుకు ఏఐకి ఆస్కారం కలుగుతుంది.

గెమ్మా 3 1బీ అనే లాంగ్వేజ్‌ మోడల్‌పై ఆధారపడి ఈ యాప్‌ పనిచేస్తుంది. కేవలం 529 ఎంబీ పరిమాణంలో వచ్చే ఈ కాంపాక్ట్ మోడల్ సెకనుకు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు. పెద్ద మొత్తంలో టెక్ట్స్‌ను క్షణాల్లో జనరేట్‌ చేయగలదు. గెమ్మా పరిమాణం చిన్నదైనప్పటికీ కోరిన కంటెంట​్‌ను సృష్టించడం దగ్గర నుంచి డాక్యుమెంట్ విశ్లేషణ, స్మార్ట్ రిప్లైల వరకు అన్నింటినీ క్షణాల్లో చేయగలిగినంత శక్తివంతమైనది.

ప్రస్తుతానికి ఈ యాప్‌ను "ప్రయోగాత్మక ఆల్ఫా విడుదల" గా గూగుల్ పేర్కొంటున్నప్పటికీ, అపాచీ 2.0 లైసెన్స్ కింద పూర్తిగా ఓపెన్ సోర్స్‌గా ఈ యాప్‌ అందుబాటులో ఉంది. అంటే డెవలపర్లు, కంపెనీలు దీనిని ఉపయోగించవచ్చు. మార్పులు చేయవచ్చు. వాణిజ్య ఉత్పత్తులలో జోడించవచ్చు. కాగా గూగుల్‌ ఏఐ ఎడ్జ్‌ గ్యాలరీ యాప్‌ ఐఓఎస్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement