అంతర్జాతీయ మార్కెట్లో.. చమురు ధరల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై పన్నులను సవరించింది. అక్టోబర్ 16 నుంచి పెట్రోల్ ఎగుమతులపై పన్నును లీటరుకు రూ. 0.50 నుంచి రూ. 2.50కు పెంచగా, డీజిల్ ఎగుమతులపై పన్నును రూ. 16 నుంచి రూ. 8.50కు తగ్గించింది. అంటే పెట్రోల్‌పై పన్ను ఐదు రెట్లు పెరిగితే, డీజిల్‌పై రూ. 7.50 తగ్గింది. ఈ కొత్త పన్ను రేట్లు మరో 15 రోజుల పాటు అమల్లో ఉంటాయి.
ప్రభుత్వం పెట్రోల్‌పై పన్ను పెంచి, డీజిల్‌పై ఎందుకు తగ్గించిందనే ప్రశ్న చాలామందికి రావచ్చు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ చమురు మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పులు. విదేశాల్లో ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు, చమురు శుద్ధి సంస్థలు దేశీయ మార్కెట్లో విక్రయించడం కంటే విదేశాలకు ఎగుమతి చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపవచ్చు. దీనివల్ల దేశంలో ఇంధన సరఫరాపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులను నియంత్రించడానికి ప్రభుత్వం ఎగుమతులపై పన్నులు విధిస్తుంది.
నిజానికి.. ప్రభుత్వం ఈ పన్నులను ఒకేసారి నిర్ణయించి, శాశ్వతంగా అమలు చేయడం లేదు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, యుద్ధ పరిస్థితులు, ఇంధన సరఫరాను బట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తోంది. గతంలో 2024లో విండ్‌ఫాల్ పన్నులను తొలగించిన ప్రభుత్వం, 2026 మార్చిలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం కావడం, చమురు ధరలు పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఎగుమతి పన్నులను ప్రవేశపెట్టింది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?, డీజిల్ ధరలు తగ్గుతాయా? అని అనుకోకూడదు. ఎందుకంటే ఈ మార్పులు విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనంపై మాత్రమే వర్తిస్తాయి. దేశీయంగా వినియోగించే పెట్రోల్, డీజిల్‌పై ఉన్న పన్నుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అందువల్ల ఈ నిర్ణయం కారణంగా పెట్రోల్ ధరలు పెరుగుతాయని లేదా డీజిల్ ధరలు తగ్గుతాయని కచ్చితంగా చెప్పలేం.
ఇదీ చదవండి: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధరలు ఇలా..


