ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో సాంకేతికత సరికొత్త వివాదానికి కేంద్రబిందువైంది. ఉక్రెయిన్ సైనిక డ్రోన్ల దాడులు, గగనతల రక్షణ వ్యూహాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ‘స్టార్‌లింక్’ సేవలను నిలిపివేయడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. రష్యాపై పోరులో కీలకమైన కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆంక్షలు ఎదురుకావడం ఉక్రెయిన్ను రక్షణపరంగా కిందకులాగేలా చేసింది.
అమెరికా-రష్యా మధ్య మారుతున్న రాజకీయ సమీకరణాలు, రష్యాతో యూఎస్ డీజిల్ ఒప్పందాల నేపథ్యంలో ఈ ఆంక్షలు అమల్లోకి రావడం గమనార్హం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రభుత్వానికి, వైట్‌హౌస్‌కు మధ్య సంబంధాలు క్షీణించడమే ఈ పరిణామాలకు కారణమని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మస్క్ స్పందన ఇదే..
ఈ వివాదంపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. స్టార్‌లింక్ అనేది ప్రధానంగా పౌర అవసరాలు, రక్షణ రంగానికి ఉద్దేశించిన వాణిజ్య సేవ మాత్రమేనని స్పష్టం చేశారు. దాన్ని ఆచరణాత్మక, దురాక్రమణ సైనిక చర్యలకు ఉపయోగించలేమని తేల్చిచెప్పారు. అలాగే, సైనిక స్థాయి కమ్యూనికేషన్ల కోసం ఉద్దేశించిన స్టార్‌షీల్డ్ (Starshield) సేవలు, వాటిపై విధించే ఆంక్షలు పూర్తిగా అమెరికా ప్రభుత్వం, సైన్యం నియంత్రణలోనే ఉంటాయని ఆయన వెల్లడించారు.
‘అమెరికా వైఖరి బాధాకరం’
ఉక్రేనియన్ సైన్యంలోని డ్రోన్ యూనిట్లు, ముఖ్యంగా హులియైపోల్ సెక్టార్లో పనిచేస్తున్న బలగాలు కమ్యూనికేషన్ వైఫల్యం వల్ల కీలక మిషన్లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. యుద్ధభూమిలో సమాచార సమన్వయం లోపించడం ఉక్రెయిన్ ప్రతిఘటనను బలహీనపరుస్తోంది. అమెరికా వైఖరిలో వస్తున్న ఈ మార్పు తమకు అత్యంత బాధాకరమని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి చర్చల్లో పురోగతి లేకపోవడం, ఇటు సాంకేతిక ఆంక్షలు ఉక్రెయిన్ను మరింత ప్రమాదకర స్థితిలోకి నెడుతున్నాయి. అంతర్జాతీయ కూటముల్లో మారుతున్న ఈ వ్యూహాత్మక పొత్తులు రాబోయేకాలంలో యుద్ధ పరిస్థితులను పూర్తిగా మార్చే సూచనలు కనిపిస్తున్నాయని కొందరు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: ఇంట్లో మహారాణులు.. పెట్టుబడుల్లో ప్రేక్షకులు!


