
సబ్ డివిజన్‌లో పెరిగిన హత్యలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా పోలీసులు గుట్టుచప్పుడు వ్యవహరిస్తున్నారు. అసలు ఆ ఘటనలను బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతూ కేసులను నీరు గారుస్తున్నారనే విమర్శలు తరచు వినిపిస్తున్నాయి. ఆలస్యంగా ఇలాంటి ఘటనే గురువారం వెలుగులోకి వచ్చింది. వడ్డేశ్వరం – ఇప్పటం బకింగ్‌హామ్ కెనాల్ ఒడ్డున ముళ్లపొదల్లో గుర్తుతెలియని అస్తిపంజరం ఉన్నట్లు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందింది. గత ఆదివారం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా ఎముకల గూడును అక్కడి నుంచి తరలించారు. జనసంచారం లేని ఆ ప్రాంతంలో ముళ్లపొదల్లో మూడు నాలుగు నెలల క్రితం మృతదేహాన్ని పడవేసి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు.
ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం
పోలీసులు బయటకు తీసిన అస్తిపంజరం పురుషునిదా? లేదా మహిళదా? అనేది నిర్ధారించడానికి కూడా వీలులేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆధారాలు సేకరించడంలో నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మృతదేహంపై దుస్తులు ఉంటే వాటికి సంబంధించి మగవారు అయితే షర్ట్ బటన్లు, ప్యాంట్ బకిల్స్, జిప్ లాంటివి లభించేవి. ఆడవారు అయితే హెయిర్ పిన్స్ కానీ, జాకెట్ హుక్స్ కానీ ఉండేవి. ఎవరైనా చంపి ఆధారాలు లభించకుండా దుస్తులను తీసివేసి ఆ మృతదేహాన్ని ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
మహిళదా, పురుషుడిదా
అని నిర్ధారించలేని పరిస్థితి
గుట్టుచప్పుడు కాకుండా
ఎముకలను తొలగించిన పోలీసులు
హత్య కేసులు పెరుగుతున్నా ఆధారాల
సేకరణలో నిర్లక్ష్యం
ఈ మధ్యకాలంలో మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలో వేశ్యలు, ట్రాన్స్‌జెండర్స్ ఎటువంటి జన సంచారం లేని ప్రాంతాల్లో తిరుగుతూ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో గొడవలు ఏర్పడినపుడు, ఆధిపత్య పోరు వచ్చినప్పుడు హత్యలు కూడా జరుగుతున్నాయి. తాడేపల్లి రూరల్‌లోని కొలనుకొండలో ఓ సంఘటన చోటుచేసుకుంది. అదే ప్రాంతంలో గుంటూరు చానల్ ఒడ్డున ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. పెదవడ్లపూడి – కాజ మధ్య పొలాల్లోని బీటీ రోడ్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ తన ప్రియుడి కోసం మరో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ఇన్ని సంఘటనలు జరిగినా తాడేపల్లి పోలీసులు మాత్రం అస్తిపంజరం ఉందన్న సమాచారం అందిన వెంటనే ఎటువంటి విచారణ చేయకుండా ఆ అస్తిపంజరాన్ని గుట్టుచప్పుడు కాకుండా మార్చురీకి తరలించారు. మంగళగిరి ప్రభుత్వ వైద్యశాలలో ఎముకల గూడుకు పోస్ట్‌మార్టం చేయలేమని చెప్పడంతో పోలీసులు గుంటూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు విశ్వసనీయ సమాచారం.