
చేయి తిరిగేలా క్రీడా శిక్షణ
తెనాలి: పట్టణ పరిధి చెంచుపేటలోని అమరావతి కాలనీలో డీఎస్‌ఏ స్టేడియానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో సకల వసతులు సమకూరిన విషయం తెలిసిందే. చేపట్టిన నిర్మాణాలు, దాతల సహకారంతో అందిన సౌకర్యాలతో పూర్తిస్థాయిలో క్రీడలకు సంసిద్ధం చేశారు. దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేనివిధంగా ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ‘శాప్’ ఆధ్వర్యంలో హ్యాండ్‌బాల్ అకాడమీ నడిచింది. తెనాలి డబుల్‌హార్స్ మినపగుళ్లు సంస్థ యాజమాన్యం ఇందుకు సహకరించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అకాడమీని పక్కన పెట్టారు.
ఉదయం, సాయంత్ర వేళల్లో...
ప్రస్తుతం వేసవిలో శాప్ ఆధ్వర్యంలో హ్యాండ్‌బాల్‌లో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రీడలో తెనాలికి గల ప్రాభవాన్ని దృష్టిలో ఉంచుకొని శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి శిబిరం నడుస్తోంది. 23 మంది ఉచితంగా శిక్షణ తీసుకుంటున్నారు. కొందరు అండర్–14, అండర్–17, సబ్‌జూనియర్ కేటగిరీల్లో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో ఆడినవారూ ఉన్నారు. కొత్తగా నేర్చుకునే ఆసక్తి కలిగినవారూ వస్తున్నారు. రోజూ ఉదయం 6–8 గంటలు, సాయంత్రం 4–7 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. స్టేడియం హ్యాండ్‌బాల్ కోచ్ నాగరాజు సెలవులో ఉండటంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్), పాటియాలలో శిక్షణ పొందుతున్న హ్యాండ్‌బాల్ క్రీడాకారుడు పి.కాలేబును కోచ్‌గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో ఫిట్‌నెస్, క్రీడలో టెక్నిక్స్, స్కిల్స్ నేర్పుతున్నారు. ఈ నెలాఖరు వరకు జరిగే శిబిరాన్ని అవసరమైతే మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాం
జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్‌ఏ) ఆధ్వర్యంలోని తెనాలి స్టేడియంలో హ్యాండ్‌బాల్ కోచ్‌గా నన్ను నియమించారు. నా పర్యవేక్షణలో వేసవి క్రీడాశిబిరం నడుస్తోంది. గతంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాను. ఎన్‌ఐఎస్‌లో శిక్షణ తీసుకుంటూ నాకున్న అనుభవంతో వేసవి శిబిరంలో శిక్షణ ఇస్తున్నా. క్రీడాకారులకు ఇదో మంచి అవకాశం. వారిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా.
– పి.కాలేబు, కోచ్
హ్యాండ్‌బాల్ క్రీడలో ఉచితంగా తర్ఫీదు
‘శాప్’, డీఎస్‌ఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆధ్వర్యంలో తెనాలిలో గల క్రీడాస్టేడియం ఇప్పుడు శిక్షణకు వేదికగా నిలిచింది. వేసవి సెలవుల్లో ఇండోర్, ఔట్‌డోర్ ఆటల్లో చిన్నారులు సాధన చేస్తున్నారు. హ్యాండ్‌బాల్ అకాడమీ నడిచిన ఈ స్టేడియంలో ప్రస్తుతం వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఎన్‌ఐఎస్ కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు.

చేయి తిరిగేలా క్రీడా శిక్షణ