ప్రభుత్వానికి నివేదించాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి నివేదించాం

May 16 2025 1:27 AM | Updated on May 16 2025 1:27 AM

ప్రభు

ప్రభుత్వానికి నివేదించాం

తెనాలి: భవన నిర్మాణాలకు అనుమతులకు సంబంధించి కొత్త విధానంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో జీవో జారీ చేసింది. సాంకేతిక కారణాలతో మార్చి నెల నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ విధానంలో భవన నిర్మాణాలకు అనుమతుల కోసం కార్పొరేషన్లు, మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ యజమానులు తిరగాల్సిన పనిలేదని పేర్కొన్నారు. అధికారులు కొర్రీలు పెట్టి వేధిస్తారన్న ఆందోళన అవసరం లేదన్నారు. లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్‌ (ఎల్‌టీపీ, లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌) ద్వారా భవన నిర్మాణానికి దరఖాస్తును పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసి, గంటల వ్యవధిలోనే అనుమతులు పొందవచ్చని చెప్పారు. నిబంధనలకు లోబడి భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను కూడా పొందవచ్చని తెలిపారు. ఈ విధానంలో 18 మీటర్ల ఎత్తులోపు అయిదు అంతస్తుల్లో నిర్మాణాలకు సులభతరం చేస్తూ ప్రభుత్వం ‘స్వీయ ధ్రువీకరణ పథకం’ తీసుకొచ్చింది. అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి ఉంచింది.

బాధ్యతంతా వారిదే..

దరఖాస్తులు, వాటికి అనుబంధ పత్రాలు అప్‌లోడ్‌ చేసిన నాటి నుంచి నిర్మాణ పనులు పూర్తి చేసే వరకు అన్ని దశల్లోనూ టెక్నికల్‌ పర్సన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఇంటి యజమానులు, నిర్మించిన కట్టడాల్లో ఏవైనా సాంకేతికపరంగా తప్పులు చేసినట్టు నిర్ధారణ అయితే సంబంధిత లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్‌ లైసెన్సును అయిదేళ్లపాటు రద్దు చేస్తామని పేర్కొంది. తప్పు తీవ్రత ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశమూ ఉందని తెలిపింది. ఆమోదిత లే అవుట్లలోని ప్లాట్లలోనే నిర్మాణాలు చేయాలని షరతు విధించింది. యాజమాన్య హక్కులు కలిగి ఉండాలని తెలిపింది. సర్వే రిపోర్టు, స్థలం విలువ ఆధారిత సర్టిఫికెట్‌ వంటివి తప్పనిసరి చేశారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యహరించినట్టు ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూస్తే అనుమతులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్లాను ఇచ్చిన తర్వాత యజమాని ఎక్కడైనా ఉల్లంఘిస్తే తమదెలా బాధ్యత అవుతుందని ఎల్‌టీపీలు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ నిర్మాణం చేసినపుడు మేమే సమాచారం ఇవ్వాలట! అధికారులు వచ్చి కూలగొడతారట... ఇదేం న్యాయం...’ అంటూ ప్లానర్లు ఆందోళన చెందుతున్నారు. ఇంటి ప్లాను కోసం వచ్చిన వారికి ఇదే చెప్పడంతో తిరిగి వెళ్లిపోతున్నారు. చైన్నె, బెంగళూరు, హైదరాబాద్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సొంతూళ్లలో ఇళ్ల నిర్మాణాన్ని మానుకొని, ఉంటున్న నగరంలోనే అద్దె ఇళ్లలో కొనసాగటమో.. అక్కడే ఏదైనా ప్లాటు కొనుక్కోవటమో చేస్తున్నారు. మరోవైపు లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్స్‌, వారి దగ్గర పనిచేసేవారు ఉపాధి కోల్పోతున్నారు.

అధికారులందరూ ఏం చేస్తారో?

తెనాలి మున్సిపాలిటీ వరకు చూసుకుంటే లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్లు 22 మంది ఉంటారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ప్లాన్లు గీసి ఉపాధిని పొందుతుంటారు. పట్టణంలో నెలకు 40–45 వరకు ప్లాన్లు ఇస్తుంటారు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పథకంలో ప్లాను గీసే బాధ్యతతోపాటు కచ్చితంగా ఆ ప్రకారం ఇల్లు/ భవనాన్ని నిర్మించేలా చూడాల్సిన బాధ్యతనూ వీరిపై ఉంచింది. పట్టణ మున్సిపాలిటీలో పట్టణ ప్రణాళిక విభాగంలో బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌, టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్లు ఉంటారు. అనధికార నిర్మాణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఈ విభాగంపైనే ఉంది. అయినా కేవలం లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్లపైనే భారం మోపటం విమర్శలకు దారితీస్తోంది. నూతన విధానం కింద 60, 100, 150 గజాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలకు వసూలు చేస్తున్న ఫీజులు అధికం. దీనికితోడు కఠిన నిబంధనలతో చిన్న స్థలాల్లో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అందుకోసమే గ్రామాల్లో ప్లాన్లు లేకుండానే ఇళ్ల నిర్మాణం చాలాకాలంగా జరుగుతోంది. సగటున పది ఇళ్లు నిర్మిస్తుంటే, ఒక ఇంటికి మాత్రమే ప్లాను గీయిస్తున్నారని, ఇప్పటివరకు జరిగిన ఇంటి నిర్మాణాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని చెబుతున్నారు.

భవన నిర్మాణ అనుమతుల

నూతన జీవోపై తీవ్ర వ్యతిరేకత

ఎల్‌టీపీలు, సర్వేయర్లను

బాధ్యులను చేసేలా నిబంధనలు

ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా

నిలిచిన ఇంటి ప్లాన్ల తయారీ

అడ్డగోలు నిబంధనలతో

ఆమోదం కోసం రాని దరఖాస్తులు

అవగాహన ప్రచారం పేరిట

ఆపసోపాలు పడుతున్న అధికారులు

ఇంటి ప్లాన్ల దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవటంపై ప్రభుత్వానికి నివేదించాం. నూతన జీవోలో రెండు సవరణలు చేశారు. ప్రస్తుతమున్న ప్లానర్లు కావాలని ప్రజల్లో అపోహలు సృష్టించారు. భవన నిర్మాణం చేయదలచినవారు పట్టణ ప్లానింగ్‌ అధికారులు లేదా హెల్ప్‌ డెస్క్‌ను సంప్రదిస్తే ప్లాను ఇస్తారు. కొత్తగా అర్హత కలిగిన ప్లానర్లు ఎవరైనా ముందుకొస్తే లైసెన్సులు ఇస్తాం. వారి చేత ప్లాన్లు తీసుకోవచ్చు.

– మధుకుమార్‌, రీజినల్‌ డెప్యూటీ డైరెక్టర్‌, టౌన్‌ప్లానింగ్‌ విభాగం

ప్రభుత్వానికి నివేదించాం 
1
1/1

ప్రభుత్వానికి నివేదించాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement