
ఎస్‌ఆర్‌కేటీ కాలనీలో కార్డన్ సెర్చ్
నరసరావుపేట రూరల్: బయట వ్యక్తుల్ని కాలనీలోకి అనుమతించవద్దని డీఎస్పీ కె.నాగేశ్వరరావు తెలిపారు. కేసానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎస్‌ఆర్‌కేటీ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 14మంది ఎస్‌ఐలు, 100మంది సిబ్బంది పాల్గొన్నారు. మూడు గంటల పాటు కాలనీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కారు, ఆటోతో పాటు 41 ద్విచక్ర వాహనాలను గుర్తించారు. రాడ్లు, కత్తులు, గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కాలనీలో అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు కాలనీలో వినియోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంటుందని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాన్య ప్రజలకు ఇబ్బందులు గురిచేసే వారిని గుర్తించి మేమున్నాం అనే భరోసా ఇచ్చేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీఐలు ఎం.వి. చరన్, హైమారావు, పి.రామకృష్ణ, లోకనాథం పాల్గొన్నారు.