బాపట్లటౌన్: రంజాన్ పండుగను పురస్కరించుకొని ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు ముస్లిం ప్రార్థన ప్రదేశాలల్లో సోమవారం పోలీసులు పటిష్టంగా బందోబస్తు నిర్వహించారు. ఈద్గాల వద్ద ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు ఏర్పడకుండా బందోబస్తు చేపట్టారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. కుల మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా సందేశాలు, వదంతులు వ్యాప్తి చేస్తే ఇటువంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సోషల్ మీడియాపై నిఘా ఉంచామని పట్టణ సీఐ రాంబాబు తెలిపారు. పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.
అయోధ్య రాముడి ధనస్సు శోభాయాత్ర
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చల్లా శ్రీనివాస్ శర్మ అయోధ్య రామమందిరానికి విరాళంగా కిలో బంగారం, 10 కిలోల వెండితో తయారు చేయించిన ధనస్సు అందజేశారు. ఈ ధనస్సును శోభయాత్ర దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కార్యక్రమ నిర్వాహకులు కనసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం ఉండవల్లి గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం కాపులబజార్‌లోని కోదండ రామాలయంలో భక్తుల దర్శనార్ధం ఆ ధనస్సును ఉంచారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ దేశంలో ప్రతి హిందువు ఈ ధనస్సును దర్శనం చేసుకునేందుకు వీలుగా శోభాయాత్రను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ యాత్ర నవంబర్ నెలలో అయోధ్యకు చేరుకుంటుందని, ఈ ధనస్సును స్వామివారికి అలంకరణ చేస్తారని తెలిపారు. గంగోత్రి పీఠాధిపతి అద్వైతనంద మహరాజ్, గౌడీమఠం పీఠాధిపతి భక్తి సుందర్, మహామండేశ్వర్ కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ఈద్గాల వద్ద పటిష్ట బందోబస్తు