స్నేహితుల చేతిలో యువకుడి దారుణ హత్య

- - Sakshi

చీరాల టౌన్‌: వారంతా స్నేహితులు.. అందరూ జల్సాలు చేస్తూ తిరుగుతుండేవారు. పాత గొడవలను మనసులో పెట్టుకుని వారిలో ఒకరిని కిరాతకంగా హత్య చేశారు. చేతుల్ని తాడుతో కట్టి, నడుముకు బండరాయి కట్టి కుందేరులో పడేసి ఏమీ ఎరుగనట్లు వెళ్లిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఈపురుపాలెంలోని కుందేరు వద్ద ఓ యువకుడి మృతదేహం నీటిపై తేలియాడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్‌ సీఐ మల్లికార్జునరావు వివరాల మేరకు.. మండలంలోని తోటవారిపాలెం గ్రామం వీరయ్యనగర్‌కు చెందిన దోనెపూడి సురేంద్రబాబు (30) అలియాస్‌ సన్నీ కూలి పనులు చేస్తుంటాడు. ఇతను అదే ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులతో స్నేహం చేస్తున్నాడు.

గతంలో స్నేహితుల మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయి. దీంతో స్నేహితుల బృందంలో సభ్యులు సురేంద్రబాబును హత్య చేయాలని నిర్ణయించుకుని సరదాగా మద్యం తాగుదామని సురేంద్రను పిలిపించుకుని ఈనెల 29 తేదీ అర్ధరాత్రి వరకు అందరూ కలిసి మద్యం తాగారు. పాత కక్షల నేపథ్యంలో అప్పటికే పథకం ప్రకారం సురేంద్రను మిగిలిన స్నేహితులు కిరాతకంగా హత్య చేశారు. అనంతరం వారు మద్యం తాగిన ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న కుందేరు వద్దకు తీసుకెళ్లి సురేంద్ర మృతదేహాన్ని హద్దురాయితో కట్టి కుందేరులో పడేసి ఏమీ తెలియనట్లుగా వెళ్లిపోయారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

భార్య ఫిర్యాదుతో వెలుగులోకి..
తన భర్త దోనెపూడి సురేంద్ర కనిపించడం లేదని, బంధువుల ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో మార్చి 31 తేదీన ఈపురుపాలెం ఎస్‌ఐ జనార్దన్‌కు సురేంద్ర భార్య ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ చేస్తుండగా ఈపురుపాలెం నుంచి తోటవారిపాలెం వెళ్లే మార్గంలోని కుందేరులో ఓ యువకుడి మృతదేహం తేలియాడుతుందనే సమాచారంతో రూరల్‌ సీఐ, ఎస్‌ఐ జనార్దన్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి మృతదేహం బాగా ఉబ్బి ఉండటం, కదలకుండా ఒకేస్థానంలో ఉండటంతో స్థానికుల సాయంతో బండరాయిని తొలగించి, మృతదేహన్ని ఒడ్డుకు తీసుకువచ్చి, సురేంద్రగా నిర్ధారించారు. ఈమేరకు సురేంద్ర కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.ఈపురుపాలెంలో సంచలనంగా మారిన యువకుడి హత్య కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సురేంద్రబాబు స్నేహితులను విచారణ చేయడంతో పాటుగా హత్యలో పాలుపంచుకున్న ముగ్గురు మిత్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఈ హత్య కేసును త్వరగా విచారించి దోషులను కఠినంగా శిక్షించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Read latest Bapatla News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top