తీరం.. రియల్‌ పరం | - | Sakshi
Sakshi News home page

తీరం.. రియల్‌ పరం

Mar 30 2023 2:02 AM | Updated on Mar 30 2023 2:02 AM

రామాపురం సముద్రతీరం ఒడ్డున అక్రమ లేఅవుట్లలో జోరుగా జరుగుతున్న నిర్మాణ పనులు - Sakshi

రామాపురం సముద్రతీరం ఒడ్డున అక్రమ లేఅవుట్లలో జోరుగా జరుగుతున్న నిర్మాణ పనులు

‘రియల్‌’ వ్యాపారులు అక్రమాలకు ‘ఒడ్డు’తుండడంతో సుందర తీరప్రాంతం కుంచించుకుపోతోంది. రీసార్ట్‌ల పేరిట జరుగుతున్న రియల్‌ దందాకు కొందరు సహకరిస్తుండడంతో పంటభూములు, బీడు భూములు అనే తేడాలేకుండా అక్రమార్కులు అడ్డంగా ప్లాట్లు వేసి రూ.కోట్లు దండుకుంటున్నారు. అసైన్డ్‌, సీలింగ్‌ భూముల్లో సైతం సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తుండడం విశేషం. అడ్డుకోవాల్సిన అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది..

చీరాల: తీర ప్రాంతంలో రిసార్టుల పేరుతో రియల్‌ మాఫియా కూడా పెట్రేగిపోతోంది. పంట భూములు, బీడు భూములు, ఎందుకు పనికిరాని భూములు, అసైన్డ్‌, సీలింగ్‌ భూములతో పాటు శ్మశానాల భూములు సైతం రియల్టర్లు రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు, సిబ్బందితో ములాఖత్‌ అయ్యి భారీస్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ దందా ప్రధానంగా తీరప్రాంతంలోని వాడరేవు, రామాపురం, పొట్టిసుబ్బయ్యపాలెం, కఠారిపాలెం, టెంకాయచెట్లపాలెం, వేటపాలెం, అక్కాయిపాలెం, ఈపురుపాలెం, తోటవారిపాలెం, పిట్టువారిపాలెం, గవినివారిపాలెం, కావూరివారిపాలెం, పచ్చమొగిలి తదితర ప్రాంతాల్లో కొనసాగుతోంది.

అధికారుల కాసుల కక్కుర్తి...

రియల్టర్లు జేబులు నింపుకొనేందుకు కనీస అనుమతులు కూడా తీసుకోకుండా పంట పొలాలను కొనుగోలుచేసి వాటిని ఇష్టానుసారంగా ప్లాట్లు వేసి ప్రజలకు అమ్మేసి నిబంధనలకు పాతర వేస్తున్నారు. తీరా అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేసి జనం మోసపోతుండగా ప్రభుత్వ ఆదాయానికి మాత్రం కోట్లాది రూపాయల్లో గండి పడుతోంది. ముఖ్యంగా తీరప్రాంత గ్రామాల్లో ఈ అక్రమ ప్లాట్ల వ్యవహారం అడ్డగోలుగా జరుగుతోంది. రెవెన్యూ అధికారులకు కాసులు కొట్టడంతో క్షణాల్లో భూమార్పిడి చేస్తున్నారు. కనీసం నివాసయోగ్యమైన ప్రాంతమా? సౌకర్యాలు ఉన్నాయో లేవో కూడా పరిశీలన చేయడం లేదు. తీరప్రాంతాల్లో వేస్తున్న మూడొంతుల లేఅవుట్లు కనీస అనుమతి కూడా తీసుకోకుండా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును కూడా రియ ల్టర్లు ఎగవేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల వాడరేవు నుంచి పొట్టిసుబ్బయ్యపాలెం వరకు 100 ఎకరాల వరకు పొలాలను ప్లాట్లుగా మార్చి విక్రయాలు చేస్తున్నారు. ఒక్కో ఎకరా రూ.3కోట్లు నుంచి రూ.5 కోట్ల వరకు అమ్ముతున్నారంటే ఈ ప్రాంతంలో రియల్‌ దందా ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. రామాపురంలోని మూన్‌లైట్స్‌ సమీపంలో సుమారు 20 ఎకరాల్లో పొలాలను లేఅవుట్లుగా మార్చారు. అలానే కీర్తివారిపాలేనికి చెందిన శనక్కాయల వ్యాపారి సముద్రం ఒడ్డునే 30 ఎకరాల మేరకు బీడు భూములను లేవుట్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. అలానే ఓ షోరూం అధినేత పంట పొలాలను లేఅవుట్లుగా మార్చడంతో పాటుగా కట్టడాలను సైతం ప్రారంభించారు.

అసైన్డ్‌, సీలింగ్‌ భూములు సైతం..

వాడరేవు, రామాపురం, పొట్టిసుబ్బయ్యపాలెం ప్రాంతాల్లో వందల ఎకరాలు ఉన్నాయి. వీటిని క్రయ విక్రయాలు జరపకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేయడం విశేషం. కొనుగోలుదారులకు అసైన్డ్‌ భూములు కొద్దిరోజుల్లో ప్రభుత్వం తొలగిస్తుందని నమ్మబలికి రియల్టర్లు అమ్మకాలు చేస్తున్నారు. సీలింగ్‌ భూము ల్లో అయితే తమ పలుకుబడి ఉపయోగించి రిజిస్ట్రేషన్లు చేయిస్తామని రూ.కోట్లు దండుకుంటున్నారు.

నిబంధనలు ఇవే..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట పొలాలను ప్లాట్లుగా మార్చి లేఅవుట్లు వేయాలంటే ఆ పొలం మార్కెట్‌ విలువలో పదో వంతు కన్వర్షన్‌ ఫీజు పది శాతం ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత విస్తీర్ణంలో పదో వంతు స్థలం పార్కులకు, 23 శాతం స్థలం రోడ్లు, ఇతర అవసరాలకు వదలాల్సి ఉంటుంది. మిగిలిన స్థలంలోనే ప్లాట్లు వేసుకొని విక్రయించుకొనే అవకాశం ఉంటుంది. లేఅవుట్‌కు కూడా ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఇందుకు రియల్టర్‌ ప్రభుత్వానికి సెక్యూరిటీ డిపాజిట్‌ కూడా కొంత చెల్లించాల్సి ఉంటుంది. అలానే మంచినీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ స్తంభాలు వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది.

ప్రభుత్వ ఆదాయానికి గండి...

పొలాన్ని ప్లాట్లుగా మార్చుకొనేందుకు ప్రభుత్వానికి ఎటువంటి ఫీజులు చెల్లించడం లేదు. నేరుగా ప్లాట్లు వేసి ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారు. 450 జీఓ ప్రకా రం అనుమతులు లేని అక్రమ లేఅవుట్లను టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అడ్డుకొని ప్లాట్ల కోసం వేసిన రాళ్లను పీకేసే అధికారం ఉంది. అలాంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని రిజిస్ట్రార్‌కు సూచించి అవి రిజిస్ట్రేషన్‌ కాకుండా చూడాల్సి ఉంది. అవసరం అనుకుంటే కలెక్టర్‌ ద్వారా రిజిస్ట్రార్‌కు నోటిఫికేషన్‌ కూడా జారీ చేయవచ్చు. అధికారులు వీటిని పట్టించుకోకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లు వేసి ప్లాట్లను అమ్మేస్తున్నారు. పట్టణంలో ఎల్‌పీఎస్‌ ద్వారా అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకొనే అవకాశం ఉన్నా ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం. నిబంధనల ప్రకారం పొలాలను నివాసాలకు అనుగుణంగా (కన్వర్షన్‌) మార్పిడి చేస్తే వాటిని సెంట్లు, గజాలలో రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు. దీంతో ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు ఆదాయం వస్తుంది. అయితే కేవలం పొలాలుగానే రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతున్నా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

పంట పొలాలే ప్లాట్లుగా.. రీసార్ట్‌ల పేరిట జోరుగా రియల్‌ ఎస్టేట్‌ అక్రమార్కులకు అధికారుల వత్తాసు తీరప్రాంతంలో భారీగా అక్రమ లే అవుట్లు

పరిశీలించి చర్యలు తీసుకుంటాం...

తీరప్రాంత గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా లేఅవుట్లను వేసే వారిని గుర్తిస్తున్నాం. అక్రమ లేఅవుట్లులో కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోవద్దు. రెవెన్యూ సిబ్బందితో సర్వే చేయించి నోటీసులు అందిస్తాం. అక్రమ లేఅవుట్లపై తగు చర్యలు తీసుకుంటాం.

– పి.సరోజిని, ఆర్డీఓ, చీరాల

నూతనంగా వేసిన అక్రమ లేఅవుట్‌ 1
1/1

నూతనంగా వేసిన అక్రమ లేఅవుట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement